Crime

అంతర్ జిల్లా దొంగ అరెస్ట్..

12 Aug, 2025 134 Views
Main Image


సిద్దిపేట అర్బన్,ఆగస్టు12 (ఆవని విలేకరి)గత కొన్ని సంవత్సరాల నుండి ఉమ్మడి మెదక్ జిల్లా కరీంనగర్ హైదరాబాద్ వరంగల్ జిల్లాలో దొంగతనాలు చేసి పలుమార్లు జైలుకు వెళ్లిన కరుడు గట్టిన అంతర్ జిల్లా దొంగను అరెస్టు చేసి అదుపులోకి తీసుకున్నట్లు సిద్దిపేట ఏసీపీ రవీందర్ రెడ్డి,త్రీటౌన్ సిఐ విద్యాసాగర్ తెలిపారు. మంగళవారం త్రీటౌన్ పోలీస్ స్టేషన్ లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఏసిపి వివరాలు వెల్లడించారు. సిద్దిపేట జిల్లా జగదేవ్పూర్ మండలం రాయవరం గ్రామానికి చెందిన డబ్బేట బాల్ లింగం అలియాస్ లింగం అలియాస్ బాబు అలియాస్ ప్రవీణ్ 30 అనే వ్యక్తి పై జిల్లాతో పాటు ఇతర జిల్లాలలో కూడా అనేక పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదైనట్లు తెలిపారు.లింగం ఏడవ తరగతి చదువుతున్న సమయం నుండే దొంగతనాలకు పాల్పడుతున్నట్లు ఏసిపి వెల్లడించారు.దొంగతనాలు వృత్తిగా మార్చుకొని కుషాయిగూడ అల్వాల్ గజ్వేల్ సిద్దిపేట వన్ టౌన్ హుస్నాబాద్ కరీంనగర్ వన్ టౌన్ కరీంనగర్ టూ టౌన్ వరంగల్ యూనివర్సిటీ కీసర జగదేవ్పూర్ జమ్మికుంట నేరేడ్మెట్ కార్ఖానా సుబేదారి గౌరారం కుకునూరుపల్లి జోహార్ నగర్ పోలీస్ స్టేషన్లలో సుమారు 80 పైగా ఇంటి దొంగతనాల కేసులు నమోదు అయ్యాయి అని తెలిపారు. దొంగతనం చేసిన వ్యక్తి గతంలో చర్లపల్లి చంచల్గూడా వరంగల్ కరీంనగర్ సిద్దిపేట సంగారెడ్డి జైల్లోకి వెళ్లాడని ఏసీపి తెలిపారు. సిద్దిపేట అర్బన్ మండలం రంగాధాంపల్లి విగ్నేశ్వర నగర్ కు చెందిన ఓ వ్యక్తి ఇంటిలో ఐదు తులాల బంగారం రెండు తులాల నెక్లెస్ రెండు తులాల మువ్వల హారం తులం నల్లపూసల దండ దొంగలించారనే ఫిర్యాదుతో త్రీటౌన్ సిఐ విద్యాసాగర్ కేసు దర్యాప్తు ప్రారంభించారు.సీసీ కెమెరాల ఆధారంగా మంగళవారం బి జె ఆర్ చౌరస్తా వద్ద బంగారం అమ్మడానికి వచ్చి బ్యాగ్ వేసుకొని నిలబడి ఉండగా సిబ్బంది సహకారంతో చాకచక్యంగా పట్టుకున్నట్లు సీఐ విద్యాసాగర్ తెలిపారు. నిందితుడు వద్ద నుండి పది తులాల నర బంగారం సెల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.నిందితుని పట్టుకోవడంలో చాకచక్యంగా వ్యవహరించిన త్రీ టౌన్ సీఐ విద్యాసాగర్, ఎస్సై వెంకటేశ్వర్లు,సిబ్బంది శ్రీనివాస్,బాబు,రాజు, స్వామి,శ్రీకాంత్,రమేష్ లను ఏసీపీ రవీందర్ రెడ్డి అభినందించారు.ఈ సందర్భంగా ఏసీపీ మాట్లాడుతూ ఇంటి యజమానులు సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. సమావేశంలో పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.