Political

మార్పు అంటే ఇదేనా... క్యూ లైన్ లో చెప్పులు.. రైతన్నల తిప్పలు

08 Aug, 2025 124 Views
Main Image


సిద్దిపేట,ఆగస్టు 08(అవనివిలేకరి)కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే మార్పు తెస్తామని చెప్పిన మాట ప్రకారమే నిజమైన మార్పు తెచ్చారని మాజీ ఎంపిపి జాప శ్రీకాంత్ రెడ్డి, బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు లింగం గౌడ్ ఎద్దేవా చేశారు. మార్పు తెస్తామని గత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పాలనలో సాగిన రోజులను మళ్ళీ తిరిగి గుర్తు చేస్తున్నారని అన్నారు. కాంగ్రెస్ పాలనలో యూరియా కోసం రైతులు మళ్ళీ చెప్పులను క్యూ లైన్ లో పెట్టే రోజులను తెచ్చారని ఆరోపించారు. శుక్రవారం సిద్దిపేట జిల్లా నంగునూరు మండల కేంద్రంలో మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ ఎడ్ల సోమిరెడ్డి, రాగుల సారయ్యలతో కలిసి వారు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. కాంగ్రెస్ రైతులకు ఇచ్చిన ఏ ఒక్క హామీని నెరవేర్చిన దాఖలాలు లేవని ఆరోపించారు. గతంలో మాజీ సీఎం కేసీఆర్ పాలన రైతుల పక్షపాతిగా పాలన కొనసాగిందని, కానీ రేవంత్ రెడ్డి పాలన రైతుల పాలిట శాపంగా మారిందని విమర్శించారు. రైతులకు యూరియా సరఫరా చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని అన్నారు. ఇప్పటికైనా రేవంత్ సర్కార్ రైతులకు సరిపడా యూరియాను అందజేయాలని, లేని పక్షంలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో రైతుల పక్షాన నిరసన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. కార్యక్రమంలో నాయకులు అయిలయ్య, చిన్న మల్లయ్య, వీరయ్య గౌడ్, సతీష్ గౌడ్, సంపత్ పాల్గొన్నారు.