Stories

చెరువును తలపిస్తున్న సీసీ రహదారి.

17 Aug, 2025 113 Views
Main Image

చెరువును తలపిస్తున్న సీసీ రహదారి.

నీరు నిలిచి దోమలతో ఇబ్బందులు

పాఠశాల పక్కనే ఉండడంతో విద్యార్థులకు తిప్పలు

నంగునూరు, ఆగస్టు 17(అవనివిలేకరి) సిద్దిపేట జిల్లా నంగునూరు మండల మగ్దుంపూర్ గ్రామంలోని ప్రభుత్వమండల పరిషత్ పాఠశాల సమీపంలో వద్ద రోడ్డుపై నిలిచిన వర్షం నీరు చెరువును తలపిస్తోంది. కొద్ది పాటి వానలకే నీరంతా సీసీ రహదారిపై నిలిచి రోజుల తరబడి నిల్వ ఉంటోంది. ప్రధాన రహదారి నుంచి గ్రామస్తులు గ్రామంలోని ప్రాథమిక పాఠశాల పక్కన నుంచి ఈ సీసీ రహదారిపై నుంచి వెళ్లాల్సి ఉంటుంది. ఈ సీసీ రహదారిపై పాఠశాల సమీపంలో వర్షపు నీరు నిల్వ ఉండడం వల్ల గ్రామంలోకి వెళ్లడానికి గ్రామస్థులు ఇబ్బందులు పడుతున్నారు. గ్రామంలోని విద్యార్థులు ప్రాథమిక పాఠశాలకు రావడానికి కూడా ఇబ్బందులు ఎదురవుతున్నాయి. గ్రామం నుంచి ఉన్నత పాఠశాలకు  వెళ్ళే విద్యార్థులు కూడా ఈ సీసీ రహదారి దాటి వెళ్లాల్సి వస్తోంది.  గ్రామస్థులు ఏదైనా పని మీద సిద్ధిపేట, నంగునూరు వెళ్ళడానికి వాహనాలు నిలిపే స్టేజి పాఠశాల పక్కనే ఉండడంతో నీరు నిలిచిన సీసీ రహదారి గుండా స్టేజి వద్దకు వెళ్లాల్సిందే. ఈ రహదారి దాటే క్రమంలో పలువురు జారీ పడుతున్నారు. ఈ రహదారిపై నుంచి నడిచి వెళ్లిన విద్యార్థులు బురద కాళ్ళతో పాఠశాలకు వెళ్లాల్సి వస్తోంది. కొద్దిపాటి వానలకే ఈ రహదారిపై నీటి నిలిచి నెలల తరబడి నిల్వ ఉంటున్నది. ఇక భారీ వానలు కురిస్తే పరిస్థితిని ఊహించుకోవచ్చు. నీరు రోజుల తరబడి నిల్వ ఉంటుండడంతో దోమలు పెరుగుతున్నాయి. దీనిని అనుకుని ప్రాథమిక పాఠశాల ఉండడంతో విద్యార్థులకు మలేరియా, టైఫాయిడ్, డెంగ్యూ, వంటి వ్యాధులు సోకే ప్రమాదం ఉంది. ఈ రహదారి వెంట ఉన్న కాలనీ వాసులు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీని పక్కనే బస్సు స్టేజి ఉండడంతో బస్సులు, ఆటోల కోసం వేచి ఉండే ప్రయాణీకులు దోమలతో ఇబ్బందులు పడుతున్నారు.


తక్కువ ఎత్తులో నిర్మించడంతో


 ప్రాథమిక పాఠశాల పక్క సందులో సీసీ రహదారిని ప్రధాన రహదారి కంటే తక్కువ ఎత్తులో నిర్మించారు. నిర్మించేటప్పుడు వరద నీరు ప్రవహించే విషయాన్ని పరిగణన లోకి తీసుకోలేదు. గ్రామంలోని వీధుల గుండా వచ్చే వర్షపు ఇక్కడకు చేరి నిల్వ ఉంటోంది. కనీసం ఇక్కడ నీరు నిల్వ ఉండకుండా బయటకు వెళ్ళేవిధంగా కనీస ఏర్పాట్లు చేయక పోవడంతో నీరు నిలుస్తోంది.


ప్రాథమిక పాఠశాల ఆవరణలోకి చేరుతున్న నీరు


వర్షం కురిసినప్పుడు నీరంతా చేరి నాలో ఉండడమే కాక ఎక్కువైన నీరు ప్రాథమిక పాఠశాల ప్రహరీ గోడ పక్క నుండి పాఠశాల ఎవరణలోకి చేరుతోంది. పాఠశాల ఆవరణ రహదారి కంటే తక్కువ ఎత్తులో ఉండడంతో వాన కురిసినప్పుడల్లా నీరు ఆవరణలోకి వస్తోంది. ఆవరణలోకి వచ్చిన నీరు నిల్వ ఉండకుండా చర్యలు తీసుకోవడం ఉపాధ్యాయులకు కష్టంగా మారింది. ఆవరణలోకి వచ్చిన నీటిని బయటకు పంపేందుకు కార్యాలయ గద పక్కన ప్రహరీ గోడ పునాది వద్ద రంధ్రం చేసి పక్కనే ఉన్న మురికి కాల్వలోకి వెళ్ళేవిధంగా ఉపాధ్యాయులు చర్యలు చేపట్టారు. అయినా వర్షం పడినప్పుడల్లా సీసీ రహదారిపై నుండి నీరు పాఠశాల ఆవరణలోకి వస్తుండడంతో ఆవరణ వరసగా మారుతోంది. ఇదే ఆవరణలో ప్రాథమిక పాఠశాలతోపాటు, అంగన్వాడీ కేంద్రం ఉంది. దీంతో విద్యార్థులు జారి పడే ప్రమాదం ఉందని ఇటు ఉపాధ్యాయులు, అటు విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు.


నీరు నిల్వకుండా చర్యలు తీసుకోవాలి


సీసీ రహదారి పల్లం కావడంతో వర్షపు నీరు నిల్వ ఉంటున్నదని ఈ రహదారి వెంట ఉన్న కాలనీ వాసులు అవేదన వ్యక్తం చేశారు. నీరు నిల్వ ఉండకుండా చర్యలు తీసుకోవాలని గ్రామ పంచాయతీ అధికారులకు, మండల పరిషత్ అధికారులకు విజ్ఞప్తి చేసినా తమ గోడు  పట్టించుకునే నాధుడు కరవయ్యాడని తమ బాధను వ్యక్తం చేశారు. తక్షణమే జిల్లా కలెక్టర్, జిల్లా పంచాయతీ అధికారులు స్పందించి పరిష్కారం చూపాలని వేడుకుంటున్నారు.