పనిలో చిత్తశుద్ధి..వృత్తిలో అంకిత భావం.
సేవలకు లభించిన గుర్తింపు
ఎస్సీఈఆర్టీ మ్యాగజైన్ లో విజయ కథనం(సక్సెస్ స్టోరీ)
సిద్దిపేట,ఆగస్టు 22(అవనివిలేకరి)పనిలో చిత్తశుద్ధి, వృత్తిలో అంకిత భావం, సేవా దృక్పథం ఉంటే అవార్డులు, గుర్తింపు వెతుక్కుంటూ వస్తాయి. చిన్నకోడూరు మండలం రామంచ ప్రాథమిక పాఠశాల ఎస్జీటీగా పనిచేస్తూ 2024 వ సంవత్సరానికి రాష్ట్ర స్థాయి ఉత్తమ అవార్డు పొందిన యాంసాని వెంకట సురేశ్ కుమార్ విజయ కథనం(సక్సెస్ స్టోరీ) తాజాగా తెలంగాణ రాష్ట్ర విద్యా పరిశోధనా సంస్థ(ఎస్సీఈఆర్టీ) ప్రచరణ ఇందుకు నిదర్శనం. తాజాగా తెలంగాణ రాష్ట్ర విద్య పరిశోధన శిక్షణ సంస్థ, నేషనల్ సెంటర్ ఫర్ స్కూల్ లీడర్ షిప్ ఎన్ఐఈపీఏ ఆధ్వర్యంలో తెలంగాణ స్కూల్ లీడర్ షిప్ అకాడమీ 2025 వ సంవత్సరంలో ప్రచురించిన ట్రైల్ బ్లేజర్స్(మార్గదర్శకులు)అనే సంచికలో విజయ కథనం ప్రచురితమైంది. దీంతో రామంచ ప్రాథమిక పాఠశాలకు మరోసారి రాష్ట్ర, జాతీయ స్థాయిలో గుర్తింపు వచ్చింది. సురేశ్ కుమార్ 2024లో రాష్ర్ట స్థాయి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డును రాష్ర్ట ప్రభుత్వం నుంచి అందుకున్నారు. సెప్టెంబర్ 5 వ తేదీన హైదరాబాద్ లోని రవీంద్రభారతిలో జరిగిన సమావేశంలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క చేతుల మీదుగా ఈ పురస్కారాన్ని అందుకున్నారు.
సురేశ్ కుమార్ 2000లో పోతన్ పల్లి ప్రాథమిక పాఠశాలలో ఉపాద్యాయ వృత్తిలో చేరారు. ఈ పాఠశాలకు దాతల సహాయంతో ఎకరం స్థలాన్ని సేకరించి పాఠశాలకు రిజిస్ట్రేషన్ చేయించారు. ఈ స్థలం విలువ ప్రస్తుతం బహిరంగ మార్కెట్లో రూ.45 లక్షల విలువ ఉంటుంది. ఈ పాఠశాలలో సురేశ్ వద్ద చదువుకున్న పలువురు విద్యార్థులు ఉన్నత స్థాయిలో ఉన్నారు. పలువురు విద్యార్థులు సైంటిస్టులుగా, సాఫ్ట్వేర్ ఇంజనీర్లుగా, బ్యాంకింగ్ రంగంలో ఉన్నత స్థానాల్లో ఉన్నారు. పోతాన్ పల్లిలో ప్రాథమికోన్నత పాఠశాలలో సురేశ్ కుమార్ కృషి వల్ల విద్యార్థుల సంఖ్య 48 నుంచి 272 పెరిగింది. దాతల సహకారంతో పాఠశాలకు 49 బెంచీలు, 20 కుర్చీలు, 7 టేబుళ్ళను సమకూర్చారు.వల్లూరు నర్సరీ నుండి మొక్కలను తెప్పించి పాఠశాల ఆవరణలో నాటి సంరక్షించడతో 2003లో హరిత పాఠశాలగా మారింది. ఆ తర్వాత నంగునూరు పరిధిలోని గంగిరెద్దుల కాలనీ అయిన రాంనగర్ ప్రాథమిక పాఠశాల కు బదిలీపై 2005 లో వచ్చారు. సంచార జీవనం గడిపే గంగిరెద్దుల వారి పిల్లల చదువు కోసం చిత్త శుద్ధితో కృషి చేశారు. వీరికి దాతల సహకారంతో ఉచిత దుస్తులు,నోట్ పుస్తకాలు, పెన్నులు, పుస్తకాలు, స్కూల్ బ్యాగులు, అందించి వారికి విద్యను బోధించారు. సంచార జీవనం గడిపే గంగిరెద్దుల వారి పిల్లలను విద్యార్థుల వసతి గృహంలో చేర్పించి వారు ప్రతి రోజు బడికి వచ్చేలా చర్యలు తీసుకున్నారు.
తొగుట మండలం పెద్ద మాసాని పల్లిలోని ఇందిరానగర్ ప్రాథమిక పాఠశాలకు 2009, లో బదిలీపై వచ్చి బడి రూపురేఖలను మార్చారు. వానాకాలంలో పాఠశాల ఆవరణలో నీరు నిలిచి విద్యార్థుల చదువుకు ఆటంకం కలుగుతుండడంతో దాతలు, ప్రజాప్రతినిధుల సహకారంతో పాఠశాల ఆవరణలో మొరం పూయించారు. పాఠశాలలో వివిధ పండ్ల మొక్కలను నాటారు. దీంతో ఆవరణ ఉద్యానవనంలా మారింది. పాఠశాలలో పెంచిన కిచెన్ గార్డెన్ విద్యార్థులకు ప్రతి రోజు రుచికరమైన మధ్యాహ్న భోజనాన్ని అందిస్తోంది. విద్యార్థులకు నోట్ పుస్తకాలు, దుస్తులు, విద్యా సామగ్రిని అందించి ఉదారతను చాటుకున్నారు. ఇందిరానగర్ లో రూ.12 వేలు వెచ్చించి గ్రామం లోని వీధులలో మొరం పోయించి అంతర్గత రహదారులను చదును చేయించారు. అప్పటి ఎమ్మెల్యే రామలింగారెడ్డి సహకారంతో ప్రధాన రహదారి నుంచి గ్రామానికి రూ.13 లక్షలతో సిసి రహదారి వేయించారు.ఇందిరానగర్ ప్రాథమిక పాఠశాలలో జ్యోతి నర్సరీ కి చెందిన శ్రీనివాస్ రెడ్డి సహకారంతో అన్ని రకాల పండ్ల చెట్లతో కలుపుకొని అర ఎకరం విస్తీర్ణంలో 500 మొక్కలు నాటి హరిత పాఠశాలగా తీర్చిదిద్దిన వైనం ప్రశంసలు అందుకున్నది. పాఠశాల ఆవరణలో జామ, ఐదు రకాల మామిడి, మునగ, బొప్పాయి, పనస, కొబ్బరి, రామ సీతాఫలం, దానిమ్మ, సపోటా, నిమ్మ, బాదాం, ఉసిరి, ఎర్రచందనం, వేప, టేకు, నీలగిరి వంటి మొక్కలు నాటి సంరక్షించారు. అవి ఇప్పుడు పెరిగి ఫలాలను ఇవ్వడమే కాక ఉద్యానవనంలా మారింది. అంతేకాక 200 మామిడి మొక్కలను, 500 ఎర్ర చందనం మొక్కలను ఇంటింటికి పంపిణీ చేశారు. అప్పట్లో విద్యార్థులకు పాఠశాల దుస్తులు ప్రభుత్వం ఇచ్చేది కాదు. దీంతో దాతల సహకారంతో రెండు జతల దుస్తులను, చెప్పులు విద్యార్థులందరికీ అందించి తన సేవాభావాన్ని చాటుకున్నారు. నోట్ పుస్తకాలను, పెన్నులు పెన్సిళ్ళు అందజేశారు.
రామంచ ప్రాథమిక పాఠశాలకు 2018లో బదిలీ అయ్యారు. దాతల సహకారంతో 2019లో రూ.70 వేలతో రామంచ ప్రాథమిక పాఠశాలకు రంగులు వేయించి ఆకర్షణీయంగా తీర్చిదిద్దారు. ఈ పాఠశాలలో సురేశ్ కుమార్ కృషి వల్ల పాఠశాలలో విద్యార్థుల సంఖ్య గణనీయంగా పెరిగింది. కరోనా సమయంలో విద్యాభివృద్ధికి చేసిన కృషి విద్యార్థుల తల్లిదండ్రుల ప్రశంశలు పొందింది. కరోనా సమయంలో లాక్ డౌన్ వల్ల ఇచ్చిన సెలవు కారణంగా పాఠశాల మూత పడడంతో సురేశ్ కుమార్ తరగతుల వారీగా వాట్సప్ గ్రూపులను ఏర్పాటు చేసి ప్రతిరోజు ఆన్లైన్ క్లాసుల ద్వారా పాఠాలు చెప్పారు. సురేశ్ కుమార్ కృషి వల్ల విద్యార్థుల సంఖ్య భారీగా పెరగడంతో పాఠశాల అభివృద్ధికి ప్రభుత్వం మన ఊరు మన బడి పథకం కింద అదనపు తరగతి గదులను నిర్మించింది. కమ్యూనిటీ సర్వీస్ నిధులను సేకరించి రూ. 20లక్షలతో ఆధునిక టాయిలెట్లు విద్యార్థుల కోసం నిర్మింపజేశారు. పాఠశాలలో వివిధ రకాల పండ్ల మొక్కలను నాటారు. ఆరు సంవత్సరాల నుంచి విద్యార్థులకు ప్రతి ఏటా రూ.60 వేలకు పైగా విలువైన నోటు పుస్తకాలను దాతలు, లయన్స్ క్లబ్ సహకారంతో అందజేశారు.దాత లక్ష్మణ్ గౌడ్ సహాయంతో పాఠశాలలో అరవై రకాల పండ్ల మొక్కలను నాటి సంరక్షిస్తున్నారు. లయన్స్ క్లబ్ సహకారంతో రూ.75 వేల విలువగల స్పోర్ట్స్ డ్రెస్ పంపిణీ చేశారు. రామంచ గ్రామానికి చెందిన బొమ్మ సంజీవరెడ్డి సహకారంతో వారి తండ్రి ధర్మారెడ్డి జ్ఞాపకార్థం రూ.95 వేల విలువగల పాఠశాల డయాస్ నిర్మించారు. ఇప్పటి వరకు దాతల సహకారంతో పాటు తన స్వంత ఖర్చుల నుంచి సుమారు నాలుగు లక్షల రూపాయల విలువజేసే వివిధ సామగ్రిని అందించారు. విద్యార్థులకు స్కూల్ డ్రెస్సులు, నోటు పుస్తకాలు, పాదరక్షలు, పెన్నులు, పెన్సిల్లు, జ్యామితి బాక్సులు, మధ్యాహ్న భోజన పళ్ళాలు, గ్లాసులు అందించారు.
-ఇప్పటి వరకు సురేశ్ కుమార్ అందుకున్న అవార్డులు
రాష్ర్ట ప్రభుత్వం నుంచి ఉమ్మడి మెదక్ జిల్లాలో చేగుంట మండల స్థాయి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు
రాష్ర్ట ప్రభుత్వం నుంచి ఉమ్మడి మెదక్ జిల్లాలో జిల్లాస్థాయి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు
లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో జిల్లా స్థాయి ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారం
వైశ్య వేదిక ఆధ్వర్యంలో రాష్ర్ట స్థాయి ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారం
లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో రాష్ర్ట స్థాయి ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారం
రాష్ర్ట ప్రభుత్వం నుంచి రాష్ట్ర స్థాయి ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారం
ఎస్సీఈఆర్టీ, నేషనల్ సెంటర్ ఫర్ స్కూల్ లీడర్ షిప్ ఎన్ఐఈపీఏ ఆధ్వర్యంలో తెలంగాణ స్కూల్ లీడర్ షిప్ అకాడమీ ప్రచురించిన ట్రైల్ బ్లేజర్స్(మార్గ దర్శకులు) సంచికలో విజయ కథనం(సక్సెస్ స్టోరీ) ప్రచురితం.