ప్రజా పాలనలో రైతు ఉత్సవాలు
నంగనూరు మార్చి 19 (అవని విలేఖరి)సిద్దిపేట నియోజకవర్గంలోని నంగునూరు మండలం నర్మెట్ట గ్రామంలోఏర్పాటు చేసిన ఆయిల్ ఫ్యాక్టరీ ప్రాంగణంలో గురువారం నిర్వహించిన ప్రజా పాలనలో రైతు ఉత్సవాలు కార్యక్రమాన్నిరాష్ట్ర శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, రాష్ట్ర శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, రాష్ట్ర మంత్రులు తుమ్మల నాగేశ్వర్ రావు, పొన్నం ప్రభాకర్, వాకిటి శ్రీహరి, పార్లమెంట్ సభ్యుడు రఘునందన్ రావు, సిద్దిపేట శాసనసభ్యులు తన్నీరు హరీష్ రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఉద్యానవన, పట్టుపరిశ్రమ, మత్స్య, విత్తనాభివృద్ధి సంస్థ, చేనేత మరియు జౌళి శాఖలతో పాటు వివిధ వ్యవసాయ ఉత్పత్తుల సంస్థలు, విజయ డైరీ, వ్యవసాయ యాంత్రికరణ సంస్థలస్టాళ్లను ప్రారంభించి పరిశీలించారు.
శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి మాట్లాడుతూ, స్వయంగా ఆయిల్ పామ్ సాగు చేసి మంచి ఫలితాలు సాధించినట్లు తెలిపారు. మొదటి రెండు సంవత్సరాల్లో అంతర్ పంటల సాగు చేసుకోవచ్చని తెలిపారు. ఫామ్ ఆయిల్ పంట సాగు ను పరిశీలించడానికి సంస్థలు, సాంకేతిక మిషనరీ వస్తున్నాయని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ప్రభుత్వం నుండి రైతులకు 4200 సబ్సిడీ అందించడం జరుగుతుందని, ఆయిల్ ఫెడ్ అధికారుల వద్ద నమోదు చేసుకోవాలని తెలిపారు. ఆయిల్ దిగుమతి చేసుకునే అవకాశం లేకుండా పంటను సాగు చేయాలని సూచించారు. స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ మాట్లాడుతూ తెలంగాణ ఆవిర్భావం కొరకు స్వర్గీయ ప్రొఫెసర్ జయశంకర్, గడ్డం వెంకటస్వామి కన్నకలలు కళ్ళ ముందు ఎలా నిజమయ్యాయో అదేవిధంగా తుమ్మల నాగేశ్వరరావు ఫార్మాయిల్ కంపెనీ కలలు నిజమయ్యాయని అన్నారు. రైతులు ఆర్థికంగా ఎదగాలని ఆకాంక్షించారు. ఆయిల్ పామ్ సాగుకు ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని తెలిపారు. ఇప్పటికే నుండి 3 వెల ఎకరాల వరకు ఆయిల్ పామ్ సాగు చేయించడం జరిగిందని, పంట సాగు చేసే 4 సంవత్సరాలు రైతులను ఆదుకునేలా రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన చేస్తుందని అన్నారు. ప్రతి రైతు పంటను సాగు చేసే అవకాశం ఉందని, రైతులు సాగు భూమి ఎంతుంటుందో దానిలో ఫామ్ ఆయిల్ పంటను సాగు చేయాలని సూచించారు. అనంతరం మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు మాట్లాడుతూ, రైతుల సంక్షేమం కోసం ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. తెలంగాణ రైతాంగానికి ఆయిల్ పామ్ పంట కీలక ఆదాయ వనరుగా మారిందన్నారు. అకాల వర్షాలు, కోతులబెడద, దొంగల భయం లేకుండా ఆయిల్ పామ్ భరోసానిస్తోందని, ఎకరానికి రూ.51 వేల వరకు సబ్సిడీ అందిస్తున్న ఏకైక పంట ఇదేనని పేర్కొన్నారు.
ఆయిల్ పామ్ తో పాటు అంతర పంటలు కూడా సాగు చేసుకోవచ్చని, మొదటి మూడు సంవత్సరాల్లో రైతులకు ఎటువంటి ఇబ్బందులు ఉండవని తెలిపారు. ప్రస్తుతం రాష్ట్రంలో సుమారు 3 లక్షల ఎకరాల్లో ఆయిల్ పామ్ సాగు జరుగుతుండగా, రాబోయే మూడేళ్లలో మరింత విస్తరణకు కృషి చేస్తున్నామని చెప్పారు. రైతులకు నాణ్యమైన విత్తనాలు అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.అదేవిధంగా, నర్మెట్ట ఆయిల్ ఫ్యాక్టరీ చరిత్రాత్మక ప్రాజెక్ట్‌గా నిలుస్తుందని, ఇక్కడ బయట నుంచి విద్యుత్ తెచ్చుకోవాల్సిన అవసరం లేకుండా ఇక్కడే 4 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి జరుగుతుందని, అవసరమైతే ప్రభుత్వానికి సరఫరా చేయగలమన్నారు. సిద్దిపేటలో రిఫైనరీ ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు.
మంత్రి వాకిటి శ్రీహరి మాట్లాడుతూ రాష్ట్రంలో పంట మార్పిడి అవసరమని, రైతులు ఆదాయపరంగా బలపడే పంటలను ఎంచుకోవాలని సూచించారు. రైతులకు అవగాహన కల్పించేందుకు ఇలాంటి కార్యక్రమాలు కీలకమని. ప్రభుత్వం రైతుల అభ్యున్నతికి కృషి చేస్తోందని, రుణమాఫీ వంటి పథకాల ద్వారా రైతులకు మద్దతు అందిస్తోందన్నారు.మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ ఆయిల్ ఫామ్ పంటను అధికంగా ప్రోత్సహిస్తున్న తుమ్మల నాగేశ్వరరావు ఆయిల్ ఫామ్ కురియన్ అని అన్నారు.150 స్టాళ్లతో నిర్వహిస్తున్న రైతు ఉత్సవాలను అందరూ సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. 22 న ముఖ్యమంత్రి రానున్నారని తెలిపారు. ఈ ఫ్యాక్టరి ద్వారా గంటకు 120 టన్నులను క్రషింగ్ చేసే సామర్థ్యం ఉందని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆయిల్ ఫామ్ సాగును ప్రోత్సహిస్తున్నాయని, దేశానికి వెన్నముకైన రైతు ఆయిల్ పామ్‌తో పాటు ఇతర పంట సాగుపై కూడా అవగాహన పెంపొందించుకోవాలని సూచించారు. సిద్దిపేట కన్నా ఎక్కువ హుస్నాబాద్ నియోజకవర్గంలో ఆయిల్ పామ్ సాగు విస్తరణకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. రైతుల సంక్షేమానికి అందరూ కృషి చేస్తున్నారని తెలిపారు. పార్లమెంట్ సభ్యుడు రఘునందన్ రావు మాట్లాడుతూ, ఆయిల్ పామ్ సాగు చేస్తున్న రైతులకు కేంద్ర ప్రభుత్వం నాలుగేళ్లపాటు ప్రతి సంవత్సరం ఎకరానికి రూ.4200 ఆర్థిక సహాయం అందిస్తోందన్నారు. ఈ పంట రైతులకు స్థిరమైన ఆదాయాన్ని అందిస్తుందని, దుబ్బాక నియోజకవర్గంలో మొదటి ఆయిల్ ఫామ్ పంటను వేసింది తానేనని పేర్కొన్నారు.
సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు మాట్లాడుతూ కాళేశ్వరం ప్రాజెక్ట్ పూర్తి అయిన తరువాత ఈ ప్రాంతంలో తేమ శాతం పెరిగి ఆయిల్ పామ్ సాగుకు అనుకూల పరిస్థితులు ఏర్పడ్డాయని తెలిపారు. సిద్దిపేట నియోజకవర్గంలో పంచుకున్నది భాగ్యలక్ష్మి 2021 జూన్ 5న మొదటి మొక్కలు నాటినట్లు గుర్తుచేశారు. సిద్దిపేట జిల్లాలో 50 వేల ఎకరాలలో ఆయిల్ ఫామ్ పంటలు పండించాలనేది తన కోరిక అని, ప్రభుత్వం మారిన ఈ ఫ్యాక్టరీ నిర్మాణాన్ని ఆపకుండా పూర్తి చేసేందుకు కృషి చేసిన మంత్రి తుమ్మల నాగేశ్వరరావుకు కృతజ్ఞతలు అని, ఖమ్మం రైతుల లాగే సిద్దిపేట రైతులు కూడా అభివృద్ధి చెందేలా రైతులందరూ ఆయిల్ ఫామ్ పంటలు వేసుకోవాలని అన్నారు. ఈ పరిశ్రమను అంతర్జాతీయ ప్రమాణాలతో అభివృద్ధి చేయాలని ఆకాంక్షించారు.దుబ్బాక శాసనసభ్యులు కొత్త ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ ఆయిల్ ఫామ్ పంట దిగుబడి కి వచ్చే ఐదు సంవత్సరాలలోపు ప్రభుత్వం రైతులను ఆర్థికంగా ఆదుకోవాలని అన్నారు.
ఈ సందర్భంగా ఆదర్శ రైతు భాగ్యలక్ష్మి తమ అనుభవాలను పంచుకున్నారు.అనంతరం అతిథులు ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీలో తిరిగి ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీ పనితీరును పరిశీలించారు.
ఈ కార్యక్రమంలో ఎంఎల్సీలు దేశపతి శ్రీనివాస్, వంటేరు యాదవ రెడ్డి, ఆయిల్ఫేడ్ కార్పొరేషన్ చైర్మన్ జంగా రాఘవరెడ్డి, రైతు కమిషన్ చైర్మన్ కోదండ రెడ్డి, ప్రిన్సిపల్ సెక్రెటరీ సురేంద్రమోహన్, జిల్లా కలెక్టర్ కె. హేమావతి, మాజీ ఎమ్మెల్సీ రాములు నాయక్, జిల్లా వ్యవసాయ అధికారి సరూపారాణి, జిల్లా ఉద్యానవన అధికారి సువర్ణ, వివిధ శాఖల జిల్లా అధికారులు, ఆయిల్ ఫెడ్ అధికారులు, అధిక సంఖ్యలో రైతులు, వ్యవసాయ శాస్త్రవేత్తలు తదితరులు పాల్గొన్నారు.