నంగునూరు, ఆగస్టు 5(అవనివిలేకరి)సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం నర్మెటలో 300 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీని త్వరలో రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ప్రారంభిస్తారని జిల్లా కలెక్టర్ కె.హైమావతి తెలిపారు. మంగళవారం జిల్లా కలెక్టర్ నంగునూరు మండలంలోని నర్మెటలోని ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీని సందర్శించారు. ఈ సందర్భంగా ఫ్యాక్టరీ నిర్మాణ పనులను పరిశీలించారు. అనంతరం ఉద్యానవన శాఖ, ఆయిల్ ఫెడ్, రెవెన్యూ, విద్యుత్, రహదారులు, భవనాల శాఖ, పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. త్వరలో రాష్ట్ర ముఖ్యమంత్రి చేతుల మీదుగా ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీ ప్రారంభోత్సవ కార్యక్రమం ఉన్నందున తగిన ఏర్పాట్లు త్వరగా పూర్తిచేయాలని ఆదేశించారు. తాత్కాలిక హెలిప్యాడ్ నిర్మించాలని చెప్పారు. ముండ్రాయి నుండి నంగునూరు వరకు రోడ్డుకు ఇరువైపుల చిన్న చిన్న చెట్లపొదలను తొలగించాలని ఆదేశించారు. ఫ్యాక్టరీ అప్రోచ్ రోడ్డు, ఫ్యాక్టరీ లోపల రోడ్ల నిర్మాణం పూర్తి చేయాలని చెప్పారు. ఫ్యాక్టరీలో భూమిని చదును చేసి రోడ్డు వెంట మొక్కలను నాటాలని తెలిపారు. బహిరంగ సభ ఏర్పాటు, వాహనాల పార్కింగ్ ఏర్పాటు, ప్రోటోకాల్ ప్రకారం అతిధుల ఆహ్వానంలో పొరపాటు జరగకుండా చర్యలు తీసుకోవాలని చెప్పారు. వేదిక అలంకరణతో పాటు, తెర(స్క్రీన్)లను ఏర్పాటు చేసి ఆయిల్ ఫామ్ రైతుల విజయ గాధలు, ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీ నిర్మాణ వీడియోలను ప్రదర్శించాలని చెప్పారు.
ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ గరీమా అగ్రవాల్, జిల్లా ఉద్యానవన అధికారి సువర్ణ, ఆయిల్ ఫెడ్ మేనేజర్ సుధాకర్ రెడ్డి, ఫామ్ ఆయిల్ మేనేజర్ శ్రీకాంత్, జిల్లా వ్యవసాయ అధికారి స్వరూపారాణి, ఎస్ఈ ఎలక్ట్రిసిటీ, పంచాయతీరాజ్ ఈ ఈ, రోడ్డు భవనాల శాఖ డీ ఈ, నంగునూరు తాసిల్దార్ తదితరులు పాల్గొన్నారు.