విద్యుత్ షాక్ తో రైతు మృతి
గ్రామంలో విషాధచాయలు
నంగునూరు,జనవరి 25(అవనివిలేకరి)సిద్ధిపేట జిల్లా నంగునూరు మండలంలోని నర్మెట గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. విద్యుత్ షాక్ కు గురై ఓ రైతు మృతి చెందాడు. ఈ ఘటనలో నర్మెటకు చెందిన పొన్నాల(జామ చెట్టు) శ్రీనివాస్ రెడ్డి(55) అనే రైతు మరణించారు. ఆదివారం ఉదయం వ్యవసాయ బావి వద్ద ఉన్న ట్రాన్స్ఫార్మర్ ఫ్యూజ్ వైర్ కొట్టి వేయడంతో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. దీంతో ట్రాన్స్ఫార్మర్ ఫ్యూజ్ వైర్ వేసేందుకు శ్రీనివాస్ రెడ్డి ప్రయత్నం చేశాడు. ఈ క్రమంలో ట్రాన్స్ ఫార్మర్ ను బంద్ చేశాడు. బందు చేసే క్రమంలో జంపర్ విరిగి న్యూట్రల్ వైర్ పై పడింది. దీని ద్వారా బంద్ చేసేందుకు వినియోగించే హ్యాండిల్ కు విద్యుత్ సరఫరా కావడంతో శ్రీనివాసరెడ్డి విద్యుదాఘాతానికి గురయ్యాడు. రైతు అక్కడికక్కడే మృతి చెందాడు. శ్రీనివాసరెడ్డికి భార్య అరుణ, కుమారుడు యాకూబ్ రెడ్డి, కూతురు ఝాన్సీరాణి ఉన్నారు. భార్య అరుణ ఫిర్యాదు మేరకు రాజగోపాలపేట పోలీసులు కేసు నమోదు చేసుకుని శవ పరీక్ష నిమిత్తం మృత దేహాన్ని సిద్ధిపేటలోని ప్రాంతీయ ఆసుపత్రికి తరలించారు. విద్యుదాఘాతంతో రైతు మృతి చెందడంతో నర్మెటలో తీవ్ర విషాదం నెలకొంది.