*అత్యాధునిక యంత్రాలతో ఆయిల్ పామ్ కర్మాగారం*
*త్వరలో ముఖ్యమంత్రి చేతుల మీదుగా ప్రారంభం*
మంత్రిగా తాను మొదట చేసిన సంతకం ఈ కర్మాగారానిదే
- తుమ్మల నాగేశ్వరరావు, రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్, సహకార శాఖ మంత్రి
నంగునూరు, సెప్టెంబరు 20(అవనివిలేకరి)ప్రపంచంలోని అత్యాధునిక యంత్రాలతో దేశంలోనే మొదటి స్థానంలో నిలిచేలా నర్మెటలో ఆయిల్ పామ్ ఫ్యాక్టరీని నిర్మించామని రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్, సహకార శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చెప్పారు. సిద్దిపేట జిల్లా నంగునూరు మండలంలోని నర్మెట గ్రామంలో నిర్మించిన ఆయిల్ పామ్ కర్మాగారాన్ని శనివారం రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్, సహకార శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, తెలంగాణ ఆయిల్ ఫెడ్ చైర్మన్ జంగా రాఘవ రెడ్డితో కలిసి సందర్శించారు. ఈ సందర్భంగా డ్రై రన్ ద్వారా ఉత్పత్తి అవుతున్న ముడి పామాయిల్ ను పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ త్వరలోనే రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల పామ్ ఆయిల్ కర్మాగారాన్ని ప్రారంభిస్తామని తెలిపారు. కర్మాగారం వద్ద రాష్ట్రంలోని లక్షమంది ఆయిల్ ఫామ్ రైతులతో సభ నిర్వహిస్తామని చెప్పారు. తాను రాష్ట్ర మంత్రిగా మొదటి సంతకం నర్మెటలోని ఆయిల్ ఫామ్ కర్మాగారం నిర్మాణానికి సంబంధించినది చేశానని తెలిపారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యేక శ్రద్ధ చూపి నిధులకు ఎక్కడ సమస్య రాకుండా చూశారని అన్నారు. జిల్లా అధికార యంత్రాంగం, ఆయిల్ ఫెడ్ అధికారులు సమన్వయంతో కర్మాగారం నిర్మాణ పనులు వేగంగా జరిగేలా చూశారని అభినందించారు. అధిక వర్షాల వల్ల నిర్మాణం మధ్యలో కొంత అంతరాయం కలిగిందన్నారు. అయినప్పటికీ పనులు వేగంగా జరిగాయని చెప్పారు. మన దేశం ప్రతి సంవత్సరం వంట నూనె కోసం రూ.లక్ష కోట్లను ఇతర దేశాలకు చెల్లిస్తోందన్నారు. కేవలం మూడు శాతం నూనె మాత్రమే మన దేశంలో తయారవుతోందని తెలిపారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలతో ఇక్కడ ఆయిల్ రిఫైనరీ కూడా నిర్మించినట్లు చెప్పారు. కల్తీ లేని స్వచ్ఛమైన వంట నూనె ఇక్కడ ఉత్పత్తి అవుతుందని పేర్కొన్నారు.
ఎలాంటి కాలుష్యం ఏర్పడకుండా పామాయిల్ గింజల పిప్పితో నాలుగు మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నట్లు తెలిపారు. దీనివల్ల విద్యుత్ ఇబ్బంది కర్మాగారానికి ఉండదన్నారు. గింజల నుంచి కూడా ఆయిల్ ను ఉత్పత్తి చేస్తున్నామని దీంతో రైతులకు మరింత ఆదాయం సమకూరుతుందని చెప్పారు. ఈ కర్మాగారంలో ఓ.ఇ.ఆర్ కూడా అధికంగా ఉండడంతో భవిష్యత్తులో ఇక్కడ ధరను నిర్ణయించి దేశంలోని ఆయిల్ ఫామ్ రైతులకు చెల్లిస్తారని తెలిపారు. సిద్దిపేట జిల్లా పీఠభూమిలో ఎత్తైన స్థానంలో ఉందన్నారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాలకు కేంద్ర స్థానంలో ఉందని, ఎక్కడి నుండైనా సులభంగా ఆయిల్ ఫామ్ గెలలను రవాణా చేయవవచ్చునని తెలిపారు. పామ్ ఆయిల్ రైతులకు మూడు రోజుల్లోనే డబ్బులు చెల్లిస్తున్నామన్నారు. దేశంలో 13 లక్షల ఎకరాలలో ఆయిల్ ఫామ్ సాగవుతోందని
దానిలో సుమారు పది లక్షల ఎకరాలు తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ లోనే రైతులు సాగు చేస్తున్నారని తెలిపారు. మానవ జన్మ ఉన్నంతవరకు వంటనూనె వాడుతూనే ఉంటారని, దీనివల్ల పామాయిల్ రైతులకు ఢోకా లేదన్నారు. రైతులు భయపడకుండా ఆయిల్ ఫామ్ సాగు చేయాలని చెప్పారు.
ప్రస్తుతం రాష్ట్రంలో 2.79 లక్షల ఎకరాలలో ఆయిల్ ఫామ్ పంట వస్తోందని తెలిపారు. ఈ సంవత్సరంలో మరో లక్ష ఎకరాలు అదనంగా వస్తుందన్నారు. రాష్ట్రంలో ప్రతి ఉమ్మడి జిల్లాకు ఒక లక్ష ఎకరాల పామాయిల్ సాగు కావాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు తెలిపారు. రాష్ట్రంలో 20 లక్షల ఎకరాల భూమి ఆయిల్ ఫామ్ సాగుకు అనుకూలంగా ఉందన్నారు. 10 లక్షల ఎకరాల్లో ఆయిల్ ఫామ్ సాగు చేస్తే మనమే దేశంలో మొదటి స్థానంలో ఉంటామన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 40 సంవత్సరాల కిందట ఆయిల్ ఫామ్ మొక్కలనను నాటడం ప్రారంభించారని తెలిపారు. ఇప్పుడు అక్కడ ఐదు, ఆరు లక్షల ఎకరాల్లో సాగు అవుతోందని చెప్పారు. మరో రెండు, మూడు సంవత్సరాల్లో ఆరు లక్షల ఎకరాల్లో సాగు చేసి దేశంలోనే నెంబర్ వన్ గా తెలంగాణని నిలపాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు..
తెలంగాణ రాష్ట్రంలో సిద్దిపేట జిల్లా మొదటి స్థానంలో నిలవాలని ఆకాంక్షించారు. ఉద్యాన వన శాఖ రాష్ట్ర డైరెక్టర్ జిల్లా కలెక్టర్లు, జిల్లా అధికారులతో సమన్వయం చేస్తూ మండలాల వారీగా ఆయిల్ ఫామ్ తోటల పెంపకం లక్ష్యాన్ని నిర్దేశించి దేశంలోనే తెలంగాణ రాష్ట్రం మొదటి స్థానంలో ఉండేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఆయిల్ పామ్ తోటల్లో అంతర పంటలుగా కోకో, జాజి లాంటి పంటలు వేసుకోవాలని చెప్పారు. పామాయిల్ పంటలలో దిగుబడి తగ్గకుండా వ్యవసాయ శాస్త్రవేత్తలు, ఉద్యానవన అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించాలన్నారు. దిగుబడి పెంచేలా రైతులకు సూచనలు సలహాలు అందించాలని ఆదేశించారు. కేంద్ర ప్రభుత్వం టన్నుకు రూ.25 వేల ధర చెల్లించాలని కోరారు. రాష్ట్ర ఆయిల్ ఫెడ్ కార్పొరేషన్ చైర్మన్ జంగా రాఘవరెడ్డి మాట్లాడుతూ
రైతులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా అన్ని సమయానికి సమకూర్చేలా మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు ప్రయత్నిస్తున్నారని చెప్పారు.
రైతులకు యూరియా అందించేలా కేంద్రంతో ఎప్పుడూ మాట్లాడుతూనే ఉన్నారని తెలిపారు. ఆయిల్ ఫామ్ కర్మాగారం పూర్తయి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చే ప్రారంభించేందుకు సిద్ధంగా ఉందన్నారు.
జిల్లా కలెక్టర్ హైమావతి మాట్లాడుతూ
సిద్దిపేట జిల్లా రైతుల అదృష్టవంతులని తెలిపారు. ఆయిల్ ఫామ్ పంటను అమ్మకానికి ఎలాంటి ఇబ్బంది లేకుండా స్థానికంగానే కర్మాగారం సిద్ధం అయిందన్నారు. ప్రభుత్వ ఆదేశాలతో ఆయిల్ ఫామ్ కర్మాగారం నిర్మాణం పూర్తి చేశామని చెప్పారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ రాష్ట్ర ప్రిన్సిపల్ సెక్రటరీ రఘునందన్ రావు, ఉద్యానవన శాఖ రాష్ట్ర డైరెక్టర్ షేక్ యాస్మిన్ భాషా, జిల్లా అదనపు కలెక్టర్ గరీమా అగ్రవాల్, అయిల్ ఫెడ్ ఎండి. శంకరయ్య, జిల్లా ఉద్యాన వన అధికారి సువర్ణ, ఆయిల్ ఫెడ్, ఉద్యానవన వ్యవసాయ తదితర శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.