Latest News
ఉద్యోగులకు చేదు ఫలితాలను అందిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం
01 Oct, 2025
84 Views
ఉద్యోగులకు చేదు ఫలితాలను అందిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం
- తన్నీరు హరీశ్ రావు, మాజీ మంత్రి, సిద్ధిపేట ఎమ్మెల్యే
సిద్ధిపేట, అక్టోబర్ 1(అవనివిలేకరి)కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వం మూడు శాతం డీఏను మంజూరు చేసి తీపి కబురు చెబితే, రేవంత్ రెడ్డి మాత్రం తెలంగాణ ఉద్యోగులకు చేదు ఫలితాలను అందిస్తున్నారని మాజీ మంత్రి, సిద్ధిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్ రావు అన్నారు. సిద్దిపేటలోని క్యాంపు కార్యాలయంలో బుధవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఐదు డీఏలు బకాయి ఉన్నాయని తెలిపారు. ఎన్నికల ముందు పెండింగ్ లో ఉన్న రెండు డీఏలను తక్షణమే చెల్లిస్తామని హామీ ఇచ్చారని, అధికారంలోకి వచ్చిన తరువాత అయిదు డీ ఏ లు బకాయి పెట్టారని విమర్శించారు. ప్రభుత్వ ఉద్యోగుల పట్ల రేవంత్ రెడ్డి ప్రభుత్వం శీతకన్ను వేస్తోందని చెప్పారు. కమిషన్ల కోసం బడా కాంట్రాక్టర్లకు బిల్లులు విడుదల చేస్తున్నారని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, చిరుద్యోగులను చిన్న చూపు చూస్తోందని మండి పడ్డారు. కేసీఆర్ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల కంటే రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఎక్కువ వేతనాలు ఇచ్చారని చెప్పారు. దేశంలో ఎక్కడలేని విధంగా 42 శాతం పీఆర్సీ అందించిన ఘనత బీ ఆర్ ఎస్ ప్రభుత్వానిదన్నారు. రెండోసారి 31 శాతం పీఆర్సీ ఇచ్చినట్లు తెలిపారు. కరోనా కంటే ముందు ఎప్పటి డీఏ అప్పుడే ఇచ్చినట్లు పేర్కొన్నారు. ఎన్నికలకు ముందు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన వెంటనే అన్ని డిఏలను, బకాయిలను తక్షణమే చెల్లించడంతో పాటు, పాత పెన్షన్ పథకాన్ని తీసుకుని వచ్చి, ఆరు నెలల్లో పీఆర్సీ అందిస్తామని హామీ ఇచ్చారని గుర్తు చేశారుఎన్నికలకు ముందు రేవంత్ రెడ్డి బడా బడా మాటలు మాట్లాడి ఎన్నికలు అయిపోయిన తర్వాత గజనీకాంత్ లా మాట్లాడుతున్నారని ఆరోపించారు. దేశ చరిత్రలో 28 రాష్ట్రాల్లో ఏ రాష్ట్రంలో కూడా ఐదు డీఏలు బకాయి లేవన్నారు.కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 22 నెలలు గడుస్తున్నా పీఆర్సీ, డీ ఏ ల ప్రస్తావనే లేదన్నారు. పీఆర్సీ ఊసెత్తితే ఉద్యోగులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉరిమురిమి చూస్తున్నాతన్నారు. దసరా పండుగ రోజు రాష్ట్ర ప్రభుత్వం పీఆర్సి, డీఏ ప్రకటిస్తుందేమో అని ఉద్యోగులు ఆశగా చూశారన్నారు. వారిని తీవ్ర నిరాశకు గురి చేశారని చెప్పారు. అభయ హస్తం భస్మాసుర హస్తం అయిందన్నారు. సరెండర్ లీవ్ వస్తే ఆ డబ్బుతో ఉద్యోగులు, పోలీస్ కానిస్టేబుళ్ళు తమ పిల్లల ఫీజులు కట్టుకుంటారన్నారు.రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత పోలీస్ సిబ్బందికి ఐదు సరెండర్ లీవులు పెండింగ్ ఉన్నాయని చెప్పారు. కే సీ ఆర్ ప్రతి పోలీస్ స్టేషన్ కు రూ.75 వేల రూపాయలు అలవెన్స్ అందించి పోలీస్ గౌరవాన్ని కాపాడారని తెలిపారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం పోలీస్ స్టేషన్ కి అలవెన్స్ బంద్ చేసిందన్నారు. పోలీస్ వాహనాల్లో పెట్రోల్ పోసే పరిస్థితి లేదన్నారు. పెట్రోల్ బంకుల్లో బకాయిలు చెల్లిస్తేనే పెట్రోల్ పోస్తామని పోలీసులను బెదిరించే పరిస్థితి వచ్చిందని విమర్శించారు. ఏఆర్, సివిల్ కానిస్టేబుళ్ళు సరెండర్ లీవులు రాక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు.కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన వెంటనే హోంగార్డులపై మొదటి సంతకం పెట్టి పర్మినెంట్ చేస్తామని మాట తప్పారని ఆరోపించారు. కే సీ ఆర్ రో.12వేల హోంగార్డు జీతాన్ని రూ.29 వేలకు పెంవారన్నారు. ట్రాఫిక్ కానిస్టేబుళ్లకు అదనపు అలవెన్స్ కూడా కేసీఆర్ ప్రభుత్వమే అందించిందన్నారు. పోలీసుల పెండింగ్ డీఏలు, సరెండర్ లీవులు చెల్లించాలని డిమాండ్ చేశారు. గత 15 నెలల నుండి ఉద్యోగుల వేతనాల నుంచి పెన్షన్ కోసం కట్ చేసిన కాంట్రిబ్యూటరీ ఫండ్ ని ప్రభుత్వం వాడుకున్నదని ఆరోపించారు. రూ.5500 కోట్ల కాంట్రిబ్యూటర్ పెన్షన్ డబ్బులను రాష్ట్ర ప్రభుత్వం దారి మళ్ళించిందని విమర్శించారు. మెడికల్ కాలేజీలో పనిచేస్తున్న ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు ఆరు నెలలుగా జీతాలు లేవన్నారు. తెలంగాణలో పెద్ద పండుగ దసరాకు జీతాలు లేక పండుగ చేసుకోలేని పరిస్థితుల్లో చిరు ఉద్యోగులు ఉన్నారని వాపోయారు. దేవాలయాల్లో ఉండే అర్చకులకు ధూపదీప నైవేద్యాన్ని కూడా ఈ ప్రభుత్వం మూడు నెలల నుండి డబ్బు చెల్లించడం లేదన్నారు. "ఆడబిడ్డలకు చీరల్లేవు. రైతులకు యూరియా లేదు. సన్న వడ్లకు బోనస్ రాదు. నిరుద్యోగులకు జాబ్ క్యాలెండర్ లేదు. నిరుద్యోగ భృతి లేదు. విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ రాదు. విద్య భరోసా కార్డు రాదు. గురుకులాల్లో విద్యార్థులకు కడుపునిండా అన్నం పెట్టడం లేదు" అని చెప్పారు. "రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత 22,000 మంది ఉద్యోగులు రిటైర్డ్ అయ్యారు. రిటైర్మెంట్ బెనిఫిట్స్ కోసం ఐదు పది పర్సెంట్ కమిషన్ ఇచ్చి తీసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది"అని అన్నారు. ఇచ్చిన హామీలను నెరవేర్చాలని అడిగిన వారిని పగబట్టి అక్రమ కేసులు పెడతామని బెదిరిస్తున్నారని విమర్శించారు. రాష్ట్రంలో పగ ప్రతీకారంతో పాలన నడుస్తున్నదని విమర్శించారు. ఉపాధ్యాయ, ఉద్యోగ వర్గాల్లో ఉత్సాహాన్ని నింపి వారు మెరుగైన సేవలు ప్రజలకు అందించేలా చర్యలు తీసుకోవాల్సింది పోయి ఉద్యోగుల ఆత్మగౌరవాన్ని రేవంత్ రెడ్డి ప్రభుత్వం దెబ్బ తీస్తున్నదని అన్నారు. "తక్షణమే బకాయిలో ఉన్న ఐదు డీఏలను విడుదల చేయాలి. ఉద్యోగుల పీ ఆర్ సీ ప్రకటించాలి. రిటైర్డ్ ఉద్యోగులకు అన్ని రకాల బెనిఫిట్స్ తక్షణమే విడుదల చేయాలి. ఉద్యోగుల అలవెన్స్ లు, పెండింగ్ బిల్లులు విడుదల చేయాలి. ఇచ్చిన మాట ప్రకారం ఓల్డ్ పెన్షన్ స్కీంని పునరుద్దరించాలి. రాష్ట్ర ప్రభుత్వం దారి మళ్లించిన రూ.5500 కోట్లను తక్షణమే తిరిగి సీపీఎస్ కాంట్రిబ్యూషన్ కు జమ చేయాలి. చిరు ఉద్యోగులు, ఆశా వర్కర్లు, అంగన్వాడీలు, రేషన్ డీలర్లు, అర్చకులకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలి. ఇచ్చిన హామీ మేరకు కాంట్రాక్టు ఉద్యోగులు, కాంట్రాక్టు లెక్చరర్లను రెగ్యులరైజ్ చేయాలి. ప్రభుత్వ ఉద్యోగులకు వెంటనే హెల్త్ కార్డును అమలు చేయాలి"అని డిమాండ్ చేశారు.ఉద్యోగులు రేవంత్ రెడ్డి బెదిరింపులకు మీరు భయపడాల్సిన అవసరం లేదని, బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందన్నారు. ఉద్యోగుల హక్కుల కోసం బీఆర్ఎస్ పార్టీ పోరాటం చేస్తుందని పేర్కొన్నారు. తెలంగాణ ఉద్యమంలో, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో ఉద్యోగుల పాత్ర గొప్పదన్నారు.ఉపాధ్యాయ ఉద్యోగుల పోరాటానికి బీఆర్ఎస్ అండగా ఉంటుందని, శాసన సభలో ప్రభుత్వాన్ని నిలదీస్తుందని తెలిపారు.
*దక్షిణ భారతదేశంపై కేంద్ర ప్రభుత్వం వివక్ష*
దక్షిణ భారతదేశం విషయంలో కేంద్ర ప్రభుత్వం వివక్షను ప్రదర్శిస్తోందని ఆరోపించారు. గోధుమల మద్దతు ధరను పెంచిన కేంద్ర ప్రభుత్వం దక్షిణ భారతదేశంలో పండే వడ్ల మద్దతు ధర ఎందుకు పెంచలేదని ప్రశ్నించారు. క్వింటాల్ గోధుమలకు రూ.160 మద్దతు ధర పెంచి రూ.2585లుగా నిర్ణయించిందన్నారు. వడ్లకు మాత్రం రూ.69 రూపాయలు పెంచి రూ.2369లు మాత్రమే నిర్ణయించారని చెప్పారుగోధుమలకు ఒక నీతి వడ్లకు ఇంకో నీతి ఎందుకు? అని నిలదీశారు. ఉత్తర భారత దేశ రైతులకు ఒక నీతి దక్షిణ భారతదేశ రైతులకు ఒక నీతి ఎందుకని ప్రశ్నించారు. గోధుమలతో సమానంగా వడ్లకు మద్దతు ధర ఇవ్వాలని డిమాండ్ చేశారు. తెలంగాణ నుండి ఇద్దరు కేంద్ర మంత్రులు, ఎనిమిది మంది బీజేపీ ఎంపీలు కేంద్రంపై ఒత్తిడి తెచ్చి వరికి మద్దతు ధర పెంచాలని కోరారు. ఆరుగాలం కష్టపడే రైతు పట్ల అంత వివక్ష ఎందుకు అని మండిపడ్డారు. దేశంలో అత్యధికంగా వరి పండిస్తున్నది తెలంగాణ రాష్ట్రమేనన్నారు. వడ్లకు మద్దతు ధర నామ మాత్రంగా పెంచడం వల్ల ఎక్కువ నష్టం తెలంగాణకే జరుగుతున్నదన్నారు. క్వింటాల్ కు రూ. 220 రూపాయలు నష్టం జరుగుతుందని చెప్పారు. ఎకరానికి 30 క్వింటాళ్లు పండితే రూ.7000లు తెలంగాణ రైతులు నష్టపోతున్నారని చెప్పారు. గోధుమలకు సమానంగా వడ్లకు మద్దతు ధర సమానంగా ఇస్తే తెలంగాణ రైతులకు ఎకరానికి రూ.7000ల లాభం వస్తుందని తెలిపారు. ఈ విషయంలో తెలంగాణ బిజెపి ఎంపీలు.. రైతుల పక్షాన నిలబడతారో కేంద్రానికి కొమ్ము కాస్తారో తేల్చుకోవాలని డిమాండ్ చేశారు.