Latest News

గోపాల్ రావు పల్లే గొల్లునేడ్చింది .

25 Sep, 2025 301 Views
Main Image
గోపాల్ రావు పల్లే గొల్లునేడ్చింది
విప్లవ నినాదాలతో నినదించింది.
వేలాదిగా తరలివచ్చిన ప్రజలు, అభిమానులు.
సిరిసిల్ల,సెప్టెంబర్ 25(అవనివిలేకరి)గోపాల్ రావుపల్లి గొల్లున ఏడ్చింది...దారిపొడవున విప్లవ నినాదాలతో నినదించింది. త్యాగాలు ఉన్నతమైనవని ప్రజలు నినదించారు. మావోయిస్టు అగ్ర నేతలు కడారి సత్యనారాయణరెడ్డి (కోసా దాదా) కట్ట రామచంద్ర రెడ్డి (రాజు దాదా) ఎన్కౌంటర్ భూటకమని, అది ఒకనాటకమని నినాదాలు చేశారు. సిపిఐ మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు సీనియర్ నాయకులు కడారి సత్యనారాయణరెడ్డి అలియాస్ (కోసా దాదా) చతిస్గడ్ రాష్ట్రంలోని నారాయణపూర్ జిల్లాలో అబూజ్మాడ్ అడవుల్లో జరిగిన ఎన్కౌంటర్లో వీరమరణం పొందిన కడారి సత్యనారాయణరెడ్డి అంత్యక్రియలు తన స్వగ్రామంలో రాజన్న సిరిసిల్ల జిల్లా గోపాల్ రావు పల్లెలో గురువారం వేలాదిమంది మధ్యన  జరిగాయి.. అంత్యక్రియలకు వివిధ జిల్లాల నుంచి ప్రజలు అత్యధికంగా తరలివచ్చారు. కడారి సత్యనారాయణ రెడ్డితో పాటు మరో మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు కట్ట రామచంద్రారెడ్డి విశ్రాంతి తీసుకుంటుండగా నిరాయుదులుగా ఇద్దర్ని అదుపులోకి తీసుకొని చిత్రహింసలకు గురిచేసి రెండు రోజుల తర్వాత ఎన్కౌంటర్లో కాల్చి చంపారని పలువురు ప్రజా సంఘాల నేతలు ఆరోపించారు. గోపాలరావు పల్లెలో ఎర్రజెండాలు విప్లవ నినాదాలతో దద్దరిల్లింది. అమరహే కడారి సత్యనారాయణ రెడ్డి అంటూ ఆయన అభిమానులు విప్లవ సానుభూతిపరులు ప్రజా సంఘాలు నేతలు ,పౌర హక్కుల నేతలు,  తెలంగాణ ఉద్యమకారులు ఆయనకు విప్లవ నివాళులర్పించారు. కడారి సత్యనారాయణరెడ్డి ఆశయాలు కొనసాగిస్తామంటూ ఆయన పార్దివ దేహం వద్ద శపథం చేశారు. విప్లవ పాటలతో గోపాల్ రావు పల్లె దద్దరిల్లింది. నినాదలతో మారుమోగింది.