Latest News

జన్మభూమి కర్మ భూమిగా మారవచ్చు - చింతమడకలో ఎంగిలిపూల బతుకమ్మ వేడుకల్లో పాల్గొన్న కవిత

22 Sep, 2025 61 Views
Main Image

*నన్ను కుటుంబానికి దూరం చేసిన వారి భారతం పడతా*


*కే సీ ఆర్ మచ్చలేని చంద్రుడు*


జన్మభూమి కర్మ భూమిగా మారవచ్చు


*చింతమడకలో ఎంగిలిపూల బతుకమ్మ వేడుకల్లో పాల్గొన్న కవిత*


సిద్ధిపేట, సెప్టెంబరు 21(అవని విలేకరి):


తనను కుటుంబానికి దూరం చేసిన వారి భరతం పడతానని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత హెచ్చరించారు. సిద్దిపేట, చింతమడకలను తమ జాగీరుగా భావించే వాళ్లకు బుద్ధి చెప్తామన్నారు. చంద్రుడి లాంటి కేసీఆర్ కు మచ్చ తెచ్చారని ఆవేదన వ్యక్తం చేశారు. భవిష్యత్తులో తన జన్మభూమి కర్మ భూమి కావచ్చునని వ్యాఖ్యానించారు. సిద్ధిపేట జిల్లా సిద్ధిపేట రూరల్ మండలం చింతమడకలో ఆదివారం  గ్రామస్తులతో కలిసి తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఎంగిలి పూల బతుకమ్మ ఆడారు. గ్రామానికి వచ్చిన కలెకుంట్ల కవితకు అంతకు ముందు ఒగ్గుడోలు, డప్పు నృత్యాలు, సంప్రదాయ వాయిద్యాలతో గ్రామస్తులు స్వాగతం పలికారు. చింతమడక శివాలయంలో కవిత ప్రత్యేక పూజలు, అభిషేకం చేశారు.

చింతకమడక గ్రామ మాదిగ సంఘం  అధ్యక్షుడు జింక స్వామి, ముదిరాజ్ సంఘం అధ్యక్షుడు చిన్నరాం ముత్యం నివాసాలలో బతుకమ్మ పేర్చారు.

రామాలయంలో ప్రత్యేక పూజలు చేశారు. హైస్కూల్ గ్రౌండ్ లో గ్రామస్తులతో కలిసి ఎంగిలి పూల బతుకమ్మ  ఆడారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ చింతమడక చరిత్ర సృష్టించిన గ్రామమని పేర్కొన్నారు. చింతమడక ముద్దుబిడ్డ కేసీఆర్ ఎవ్వరూ మాట్లాడక ముందే తెలంగాణ కోసం కంకణ బద్దులయ్యారని, రాష్ట్రమంతా తిరిగి అందరినీ మేల్కొలిపి తెలంగాణ ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోయారని చెప్పారు.  ఆయన ముందడుగు వేస్తేనే తెలంగాణ రాష్ట్రం వచ్చిందన్నారు. చింతమడక మట్టి నుంచి  ఉద్యమం పుట్టి దేశ, రాష్ట్ర చరిత్రను మార్చిందన్నారు. చింతమడకలో బతుకమ్మ ఆడేందుకు తనను ఆహ్వానించటం సంతోషంగా ఉందన్నారు. ఉద్యమం ప్రారంభమైన తర్వాత కేసీఆర్ ఇక్కడ రాజీనామా చేసి ఇంకొకరిని ఇక్కడ పెట్టారని పేర్కొన్నారు. ఆనాటి నుంచి సిద్దిపేట, చింతమడక రావాలంటే అదేదో ప్రైవేట్ ప్రాపర్టీ, కేజీఎఫ్ లాగా ఇక్కడ ఆంక్షలు పెట్టారని తెలిపారు. ఇవ్వాళ్టికీ కూడా ఆ ఆంక్షలు ఉన్న సంగతి తెలిసిందే అన్నారు. చింతమడక కేసీఆర్ అనే చిరుతపులిని కన్న గడ్డ అనీ, అలాంటి గడ్డ మీద ఎవరీ ఆంక్షలు నై జాన్తా అని మొత్తం ఊరంతా నిరూపించిందన్నారు. ఇదే ఒరవడి కొనసాగాలని  ఆకాంక్షించారు. ఎంత ఎక్కువ ఆంక్షలు పెడితే అన్ని ఎక్కువ సార్లు ఇక్కడికి వస్తానని తెలిపారు. ఆనాడు ఆంధ్రోళ్లు వందల ఆంక్షలు పెట్టినా బుల్లెట్లకు ఎదురు పోయి ఉద్యమం చేసిన చరిత్ర మనకు ఉందన్నారు. రాజకీయంగా కొన్ని ఆంక్షలు పెడితే ఆగేదీ లేదన్నారు. ఖచ్చితంగా చింతమడకకు, సిద్దిపేటకు మళ్లీ మళ్లీ వస్తామన్నారు. ఆంక్షలు పెడితే ఇంకా ఎక్కువ సార్లు వస్తానన్నారు. చింతమడక తలెత్తుకొనే విధంగా కేసీఆర్ తెలంగాణ తెచ్చారని చెప్పారు. ఆయనను ఇక్కడ చంద్రుడు అని పిలుస్తారని, అలాంటి చంద్రునికి కొంతమంది మచ్చ తెచ్చే పని కొంతమంది చేశారని ఆరోపించారు.

మచ్చ తెచ్చారని చెప్పగానే తల్లిని, పిల్లను దూరం చేశారని వాపోయారు. కుటుంబానికి దూరం చేశారని బాధలో ఉన్న సమయంలో చింతమడక గ్రామస్థులు తనకు అండగా నిలిచారని చెప్పారు. చాలా ఏళ్లుగా తాను చింతమడకకు రాలేదన్నారు. గత ఏడాది ఒక రకమైన బాధాకర పరిస్థితులుంటే. ఈ ఏడాది ప్రత్యేక పరిస్థితి ఉందన్నారు. ఇలాంటి సమయంలో తనను అక్కున చేర్చుకొని రమ్మన్నందుకు సంతోషంగా ఉందన్నారు. సొంత ఊరంటే ఎవరికైనా ప్రేమ ఉంటుందన్నారు. చింతమడకలో చాలా జ్ఞాపకాలు ఉన్నాయన్నారు. కులాలకు, మతాలకు అతీతంగా అన్ని పండుగలు చేసుకున్నట్లు తనకు బలంగా గుర్తుందన్నారు. చిన్నప్పుడు ఇక్కడకు వచ్చి అన్ని కులాలను కలుపుకొని బతుకమ్మ ఆడుకున్నామన్నారు.  అన్ని కులాలను కలుపు కోవాలని చింతమడక నేర్పించిందని చెప్పారు. ఆ ధైర్యంతోనే తెలంగాణ ఉద్యమంలో ప్రతి పల్లెలో బతుకమ్మ ఎత్తుకొని కాళ్లకు బలపం కట్టుకొని తిరిగానని చెప్పారు. చింతమడక ఇచ్చిన ధైర్యంతోనే నేను అదంతా చేశానని తెలిపారు. ఇక్కడి ప్రజల ఆశీర్వాదంతో కేసీఆర్ భూకంపం పుట్టించి తెలంగాణ తెచ్చి పెట్టారు. అదే ఆశీర్వాదం తనకు ఇస్తే నా జన్మభూమి కూడా కర్మభూమి కావచ్చు అని వ్యాఖ్యానించారు.  పెళ్లి అయి కుటుంబాన్ని వదిలేస్తే ఎంతో బాధ ఉంటుందని చెప్పారు. తల్లి, తండ్రి బాగుండాలని కొట్లాడే తనను తన కుటుంబానికి దూరం చేసే కుట్ర చేసిన వాళ్లను వదలి పెట్టనన్నారు. చింతమడక గడ్డకు ఎంత పౌరుషం ఉందో చూపిస్తానని, ఈ ప్రయాణంలో చింతమడక గ్రామస్థులు తనకు అండగా ఉండాలని కోరారు. ఏ ఊరు కూడా ఎవరీ అయ్య జాగీరు కాదని, కొంతమంది తమ జాగీరుగా భావిస్తున్నారని విమర్శించారు. అలాంటి వాళ్ల భరతం పడతామని పేర్కొన్నారు.చింతమడకకు రావటం సంతోషంగా ఉందని చెప్పారు.