Latest News
తెలంగాణ ప్రజల బాణాన్ని
01 Nov, 2025
71 Views
తెలంగాణ ప్రజల బాణాన్ని...
తెలంగాణలో రాజకీయ శూన్యత నెలకొంది.
- తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత
కరీంనగర్, నవంబర్ 01(అవనివిలేకరి)తెలంగాణ రాష్ట్రంలో రాజకీయ శూన్యత నెలకొందని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత వ్యాఖ్యానించారు. జాగృతి జనం బాట కార్యక్రమంలో భాగంగా శనివారం కరీంనగర్లో నిర్వహించిన ప్రెస్ మీట్ లో కల్వకుంట్ల కవిత మాట్లాడారు. ఈ సందర్భంగా కవిత ఈ తాను వాళ్ల, వీళ్ల బాణాన్ని కాదని.. తెలంగాణ ప్రజల బాణాన్ని అని చెప్పారు. జనం బాట పూర్తైన తర్వాత తమ కార్యాచరణ ప్రకటిస్తామన్నారు. రాజకీయ పార్టీలు ప్రజల తరపున పోరాటాలు చేయటం లేదని చెప్పారు. కొన్ని రాజకీయ పార్టీలను నమ్ముకొని దగా పడ్డామని ప్రజలు తనతో చెబుతున్నారని చెప్పారు. ప్రజల సమస్యలు తీర్చటమే తమ ప్రథమ ప్రాధాన్యమని చెప్పారు. ప్రజల గొంతుకగా మారుతామని తెలిపారు. ప్రధాన పార్టీలన్నీ జూబ్లీహిల్స్ ఎన్నికలో బిజీగా ఉన్నాయని,మొంథా తుపానుతో రైతులు నష్టపోయిన పట్టించుకోవడం లేదన్నారు. వరంగల్ నగరమంతా నీటిలో మునిగితే పోరాటం చేయాల్సి పార్టీలు పట్టించుకోవడం లేదన్నారు. అధికార, ప్రతిపక్షాలు ప్రజల కోసం తిరగటం లేదన్నారు. ప్రజల తరపున తాము పోరాటం చేస్తామని చెప్పారు. జాగృతి రాజకీయ వేదికేనని, తాము చాలా సందర్భాల్లో రాజకీయాలు మాట్లాడామన్నారు. జాగృతి ది తెలంగాణ లైన్ అని, తాము ప్రజల కోసమే పోరాడుతామన్నారు. మోడీ కార్మికుల హక్కులను కాల రాస్తుంటే కాంగ్రెస్, బీఆర్ఎస్ లు పోరాటం చేయడం లేదన్నారు. రైతు చట్టాల గురించి మాట్లాడిన రాహుల్ గాంధీ లేబర్ చట్టాల గురించి మాట్లాడ లేదన్నారు. రైతు చట్టాలు మారినా కార్మికులకు అన్యాయం చేసే చట్టాల విషయంలో మార్పు రాలేదన్నారు. మోడీ కారణంగా కార్మికులు ఇబ్బంది పడుతున్నారని కార్మికుల కోసం కొట్లాడిన వ్యక్తిగా చెబుతున్నానన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల సమయంలోనే ఏం చేయాలన్న నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. పార్టీ మారిన ఎమ్మెల్యేల విషయంలో స్పీకర్ గారు ఇంకా రెండు నెలల సమయం కోరడం అంటేఅంటే విషయాన్ని ఇంకా సాగ దీసే ప్రయత్నంలో ఉన్నారని ఆరోపించారు.జూబ్లీహిల్స్ ఎన్నికల్లో తమకు ఎలాంటి స్టాండ్ లేదన్నారు. ఫీజు రీయింబర్స్ మెంట్ పై తను శాసన మండలిలో మాట్లాడితేనే సీఎం రూ.700 కోట్లు ఇచ్చారన్నారు.ప్రతి నెల నిధులు విడుదల చేస్తామని చెప్పి చేయటం లేదని చెప్పారు. పాఠశాలలు, కళాశాలల యాజమాన్యాలు ఆందోళన చేస్తే వారికి మద్దతుగా ఉంటామని పేర్కొన్నారు. పాఠశాలలు బంద్ కాకుండా పోరాటం చేస్తామని చెప్పారు. ఏపీకి 23 మంది సీఎంలు అయితే ఒక్క బీసీ గానీ, మహిళ గానీ ఎందుకు సీఎం కాలేదు? అని ప్రశ్నించారు.అన్ని ప్రాంతాలు తిరిగి ప్రజల అభిప్రాయం తీసుకొని కార్యాచరణ తీసుకుంటామన్నారు. హడావుడిగా ప్రకటనలు చేయబోమన్నరు. అవసరమైతే మళ్లీ ప్రజల దగ్గరకు వెళ్లి వారి అభిప్రాయాలు తీసుకుంటామని తెలియజేశారు. తన రాజీనామాను అంగీకరించాలని చేయమని కోరానన్నారు. స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడు ఉంటాయో వారికే అర్థం కావటం లేదన్నారు.వీలైనంత తొందరగా సామాజిక తెలంగాణ, బీసీ రిజర్వేషన్లు పూర్తి కావాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. వచ్చే మూడేళ్లలో చాలా మార్పులు వస్తాయని, నియోజకవర్గాల పునర్విభజనతో మహిళలకు మేలు జరుగుతుందన్నారు. తెలంగాణలో 69 మంది మహిళ ఎమ్మెల్యేలు అవుతారని చెప్పారు. దగాపడ్డ తెలంగాణ ఉద్యమకారులను కచ్చితంగా అక్కున చేర్చుకుంటామన్నారు. పరిహారం అందని అమరవీరుల కుటుంబాలకు పరిహారం ఇప్పించే ప్రయత్నం చేస్తామని చెప్పారు. జాగృతి జనం బాట కార్యక్రమానికి ప్రజల నుంచి అద్భుతమైన స్పందన వస్తోందన్నారు. సామాజిక తెలంగాణ సాధనలో వెనుకడుగు వేయవద్దని ప్రజలు కోరుతున్నారని తెలిపారు. సమసమాజం రావాల్సిన అవసరముందన్నారు. స్వాతంత్రం వచ్చి 79 ఏళ్లు, స్వరాష్ట్రం తెచ్చుకొని 12 ఏళ్లైనా పరిస్థితిలో మార్పు లేదని వాపోయారు. కనీసం విద్య, వైద్యం కూడా ప్రజలకు అందివ్వలేక పోతున్నామన్నదే తన ఆవేదన, బాధ అని తెలిపారు. పేదవాడికి విద్య, వైద్యం, ఫీజు రీయింబర్స్ మెంట్ అందించాల్సిన అవసరం ఉందని చెప్పారు.ఫీజు రీయింబర్స్ మెంట్ ఇవ్వకపోతే పిల్లలు చదువు మానేసే పరిస్థితి ఉంటుందన్నారు.ఆర్టీసీ, సింగరేణి కార్మికులకు నష్టం జరిగే విధంగా చట్టాలు చేశారని, పోరాడితే తప్ప ఏదీ రాని పరిస్థితిని తీసుకొచ్చారని ఆరోపించారు. గతంలో కేసీఆర్ మద్దతుతో సింగరేణి కార్మికుల హక్కులను కాపాడుకున్నామని తెలిపారు.ఆర్టీసీలో ఉన్న దారుణమైన పరిస్థితిపై ప్రతి ఒక్కరు ఆలోచించాల్సి ఉందన్నారు.సహజ వనరులు వాడుకోవాలని, ఇందుకు తాము వ్యతిరేకం కాదన్నారు. 10 మీటర్లని చెప్పి 100 మీటర్లు తవ్వటాన్ని వ్యతిరేకిస్తామన్నారు. కరీంనగర్ నుంచి వేములవాడకు వెళ్లే మార్గం దుమ్ముతో నిండిపోయిందన్నారు. గతంలో తాను ఏమీ అనలేని బంధనాలు ఉండేవని ప్రస్తుతం తాను స్వేచ్చా పక్షినన్నారు. గ్రానైెట్ ఆదాయాన్ని కరీంనగర్ జిల్లా అభివృద్ధికి వినియోగించాల్సిన అవసరముందన్నారు. హుజురాబాద్, మానకొండూరులో ఏ రహ దారి చూసినా ఆధ్వాన్నంగా తయారైందన్నారు. ఈ పరిస్థితి ఎందుకు ఉందో ప్రతి ఒక్కరు ఆలోచించాలని కోరారు. ఇక్కడ చేపట్టిన వంతెన నిర్మాణం ఎప్పుడు పూర్తవుతుందో కేంద్ర మంత్రి బండి సంజయ్ చెప్పాలన్నారు. మొంథా తుపాను కారణంగా రైతుల పరిస్థితి దయనీయంగా తయారైందన్నారు. ఆయా జిల్లాల్లో రైతులకు ఎకరాకు రూ. 50 వేలు పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. సాంఘిక సంక్షేమ వసతి గృహాలలో విద్యార్థుల మరణాలు బాధిస్తున్నాయన్నారు. శ్రీ వర్షిత అనే అమ్మాయి వెల్పేర్ హాస్టల్ లో చనిపోయిందన్నారు. తల్లిదండ్రులతో శ్రీ వర్షిత మాట్లాడిన గంటలోపే ఆమె చనిపోయిందని తెలిపారు. శ్రీ వర్షిత విషయంలో ఏం జరిగిందో తెలియాలి? అని ప్రశ్నించారు. ఏడాదిన్నర కాలంలో సాంఘిక సంక్షేమ వసతి గృహాలలో 110 మంది పిల్లలు చనిపోయారన్నారు. సంక్షేమ వసతి గృహాలలోకి తల్లితండ్రులు పిల్లలను పంపించే విధంగా పరిస్థితులు మారాలన్నారు. మానకొండూరు, హుజురాబాద్ మధ్య ఉన్న కల్వల ప్రాజెక్ట్ మత్తడి కొట్టుకుపోయి మూడు ఏళ్లు గడుస్తున్నా పట్టించుకోవటం లేదన్నారు. మత్తడి కి శాశ్వత పరిష్కారం కావాలని డిమాండ్ చేశారు. ఇప్పటికే మంజూరు చేసిన రూ.70 కోట్లు తక్షణమే ఇవ్వాలని కోరారు. మత్తడి మరమతు చేయక పోవడం వల్ల చేపలు పట్టుకునే 180 ముదిరాజ్ కుటుంబాలకు ఇబ్బంది పడుతున్నారని తెలిపారు. ఆరగండ్ల, కన్నపూర్ రోడ్ తక్షణమే బాగు చేయించాలని డిమాండ్ చేశారు. గుండ్లపల్లి, గన్నేరువరం రోడ్డు త్వరగా పూర్తి చేయాలని కోరారు. రామడుగులో ఉన్న శిల్ప కళాకారులను కాపాడుకోవాల్సిన అవసరముందన్నారు.శిల్ప కళాకారులందరికీ కలిపి కలిపి ఐదు ఎకరాల స్థలం ఇవ్వాలని, ఉచిత విద్యుత్ సౌకర్యం శిల్పకళాకారుల ఖార్ఖానాలకు ఇవ్వాలని కోరారు. కరీంనగర్ పట్టణానికి స్మార్ట్ సిటీ కోసం రూ. వెయ్యి కోట్లు కేటాయించారనీ, ఇప్పటికీ కరీంనగర్ స్మార్ట్ సిటీ కావడం లేదన్నారు. కరీంనగర్లో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ లేదు. డైరెక్ట్ గా మానేరులోకి డ్రైనేజీ వాటర్ ను డంప్ చేస్తున్నారని తెలిపారు.గ్రానైట్ మాఫియా నుంచి సహజ వనరులను కాపాడుకోవాల్సిన అవసరం ఉందన్నారు. గతంలో నిబంధనలు ఉల్లంఘించిన వారిపై జరిమానాలు విధించినప్పటికీ ఆ తర్వాత ఎవరూ పట్టించుకోవడంలేదని వాపోయారు. గ్రానైట్ మాఫియాకు వ్యతిరేకంగా ఉద్యమం చేసిన వాళ్లను హింసించారని ఆరోపించారు.