Latest News

నక్సలైట్లతో శాంతి చర్చలు జరపాలి.

17 Aug, 2025 113 Views
Main Image

ఆగస్టు 24 న వరంగల్ లో జరిగే బహిరంగ సభను జయప్రదం చేయండి.

ఆదివాసుల పై హత్యాకాండను ఆపి, నక్సలైట్లతో శాంతి చర్చలు జరపాలి.

సిద్దిపేట, ఆగస్టు 17(అవనివిలేకరి)మధ్యభారతంలో ఆదివాసులు, గిరిజనుల పైన కేంద్ర ప్రభుత్వం ఆపరేషన్ కగార్ పేరిట చేస్తున్న హత్యాకాండను తక్షణమే ఆపివేయాలని కోరుతూ ఆగస్టు 24 న వరంగల్ అంబేద్కర్ భవన్లో నిర్వహించబోయే బహిరంగ సభను జయప్రదం చేయాలని కోరుతూ ఆదివారం సిద్దిపేట ప్రెస్ క్లబ్ లో పౌర హక్కుల సంఘం జిల్లా అధ్యక్షులు రాగుల భూపతి అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. అనంతరం వివిధ ప్రజా సంఘాల నాయకులు గోడ ప్రతులు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పౌర హక్కుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎన్. నారాయణరావు, తెలంగాణ ప్రజా ఫ్రంట్ రాష్ట్ర కన్వీనర్ జి.సత్తయ్య,పీ.డీ.ఎస్.యు రాష్ట్ర అధ్యక్షుడు ఎస్.వి.శ్రీకాంత్, ప్రముఖ న్యాయవాది ఏ.బాబురావు, దళిత నాయకులు భీమసేన మాట్లాడుతూ నరేంద్ర మోడీ,అమిత్ షా అడవులలో నివసిస్తున్న ఆదివాసి,గిరిజన ప్రజల పై హత్యాకాండను కొనసాగుతున్నారని మండిపడ్డారు. అడవుల్లో ఉన్న సహజసిద్ధమైన ఖనిజ సంపదలను కార్పొరేట్, ప్రైవేటు ,పెట్టుబడిదారి కంపెనీలకు దారాదత్తం చేసేందుకు కుట్రలు చేస్తున్నారని, అడ్డువస్తున్న ఆదివాసి జాతిని నిర్మూలించేందుకు ఆపరేషన్ సర్వజుడుం , గ్రీన్ హంట్,సమాధాన్, ఆపరేషన్ కగార్ల పేరిట దాడులు, అత్యాచారాలు, నిర్బంధాలను ప్రయోగిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదివాసి హక్కులను అణచివేస్తున్న ఈ నేపథ్యంలో వారికి అండగా ఉండాల్సిన బాధ్యత దేశంలో ఉన్న ప్రజలు ప్రజాస్వామ్య వాదుల పైన ఉన్నదని తెలిపారు. ఆదివాసుల అత్యాకాండకు వ్యతిరేకంగా శాంతి చర్చలు జరపాలని, కాల్పుల విరమణ పాటించాలని ప్రజలు ఆందోళనలు చేస్తున్నారని అయినా ప్రభుత్వం వాటిని పట్టించుకోకుండా ఛత్తీస్గఢ్,బస్తర్ లో వందలాది సాయుధ క్యాంపులను నెలకొల్పి పేసా చట్టం, 2006 అటవీ హక్కుల చట్టాల ఉల్లంఘనలకు పాల్పడుతుందని, ఇది అప్రజాస్వామీకమని అన్నారు. మధ్య భారతంలో ఆదివాసీల హననానికి వ్యతిరేకంగా మరియు శాంతి చర్చలు జరపాలని ప్రధానమైన డిమాండ్స్ పైన ఆగస్టు 24న అంబేద్కర్ భవన్లో బహిరంగ సభను నిర్వహిస్తున్నట్లు ఈ సభకు అన్ని రాజకీయ పార్టీలు, ప్రజాసంఘాలు, పౌర హక్కుల సంఘాలు ,మేధావులు హాజరవుతున్నట్లు దీనిలో ప్రజలు పెద్ద ఎత్తున హాజరై ఇట్టి సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పౌర హక్కుల సంఘం, తెలంగాణ ప్రజా ఫ్రంట్, పిడిఎం, డిటిఎఫ్, కేఎన్పిఎస్, డి డి ఎస్ ఎఫ్, బి ఎల్ టి యు, దళిత బహుజన సంఘాల నాయకులు నర్సింలు, బాకీ చంద్రబాను, కొమ్ము దుర్గారాములు, మొగిలి బిక్షపతి,కీసర ఎల్లం, భూపాల్, దెబ్బట ఆనంద్, శివరాత్రి శ్రీనివాస్,మల్లయ్య, బ్రహ్మం, యాదగిరి,లక్ష్మీ నారాయణ,రాజు తదితరులు పాల్గొన్నారు.