చివరకు పదో తరగతి పరీక్షల విధానంపై తీసుకున్న నిర్ణయాన్ని విద్యాశాఖ వెనక్కి తీసుకుంది. ఇంటర్నల్ మార్కులను రద్దు చేయాలనే ఆలోచనను వాయిదా వేసింది. దీంతో విద్యార్థులకు ఈ సంవత్సరం కూడా పాత పద్ధతిలోనే పరీక్షలు జరుగుతాయి. 80 మార్కులకు రాత పరీక్ష, 20 మార్కులకు ఇంటర్నల్ మార్క్స్ ఉండనున్నాయి. ఈ నిర్ణయం విద్యార్థులకు, తల్లిదండ్రులకు ఊరటనిచ్చింది. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ బోర్డు ఆగస్టు 11న ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రంలో దాదాపు 5 లక్షల మంది విద్యార్థులు పదో తరగతి పరీక్షల కోసం ఎదురు చూస్తున్నారు. గత ఏడాది నవంబర్‌లో విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఇంటర్నల్ మార్కులను ఎత్తేశామని తెలిపింది. కానీ ఇటీవల ఢిల్లీలో జాతీయ విద్యా పరిశోధన, శిక్షణ మండలి(NCERT) నిర్వహించిన వర్క్‌షాప్‌లో విద్యా శాఖ తీసుకున్న ఈ నిర్ణయంపై పలు ప్రశ్నలు తలెత్తడంతో పునరాలోచనలో పడింది.