Latest News
ఫ్యాక్టరీ రావడానికి కష్టపడింది బీఆర్ఎస్ పార్టీ. మళ్లీ కెసిఆర్ ప్రభుత్వం వస్తుంది - హరీష్ రావు
22 Sep, 2025
45 Views
పామాయిల్ కర్మాగారంతో రైతుల జీవితాల్లో గుణాత్మకమైన మార్పు
ఈ ఫ్యాక్టరీ రావడానికి కష్టపడింది బీఆర్ఎస్ పార్టీ.
విత్తనం నాటింది బీ ఆర్ ఎస్... ఆ పండ్లను తినడానికి బయలుదేరింది కాంగ్రెస్.
కాళేశ్వరం ప్రాజెక్టుతో తేమ శాతం పెరిగి పామాయిల్ సాగుకు అనుకూలం.
మళ్లీ కెసిఆర్ ప్రభుత్వం వస్తుంది
ప్రతి జిల్లాకు పామాయిల్ ఫ్యాక్టరీ ఏర్పాటు
- తన్నీరు హరీశ్ రావు, మాజీ మంత్రి, సిద్ధిపేట ఎమ్మెల్యే.
నంగునూరు, సెప్టెంబరు 22(అవనివిలేకరి) వేలాదిమంది రైతుల జీవితంలో ఆయిల్ పామ్ కర్మాగారం గుణాత్మకమైన మార్పు తీసుకువచ్చి, దశ దిశను మారుస్తుందని మాజీ మంత్రి, సిద్ధిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్ రావు పేర్కొన్నారు. సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం నర్మెట గ్రామంలో నూతనంగా నిర్మించిన పామాయిల్ కర్మాగారం ట్రయల్ రన్ విజయవంతమైన నేపథ్యంలో సోమవారం కర్మాగారాన్ని మాజీ మంత్రి, సిద్ధిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్ రావు, ఎమ్మెల్యే లు కొత్త ప్రభాకర్ రెడ్డి, పల్లా రాజేశ్వర్ రెడ్డి, ఎమ్మెల్సీలు యాదవ రెడ్డి, దేశపతి శ్రీనివాస్, నాయకులు వంటేరు ప్రతాపరెడ్డి, ఫారూక్ హుస్సేన్ ఇతర బీ ఆర్ ఎస్ పార్టీ నేతలతో కలిసి సందర్శించారు. ఈ సందర్భంగా హరీశ్ రావు మాట్లాడుతూ పామ్ ఆయిల్ కర్మాగారం కల సాకారం కావడం గొప్ప విజయమని అన్నారు. ఈ ప్లాంట్ సాకారం కావడం ఆనందంగా ఉందన్నారు.అందరి దృష్టిలో ఇది కర్మాగారం అయితే ఈ ప్రాంత రైతుల దృష్టిలో ఇది ఒక భావోద్వేగమని చెప్పారు. తాను 2004లో కొత్తగా ఎమ్మెల్యే అయినప్పుడు నా పక్క పొలం రైతు బోరు వేస్తున్నాడు,దీన్నీ ఆపాలని కోరుతూ ఒక రైతు నంగునూరు నర్మెట నుండి ఒక ఫోన్ చేశాడని గుర్తు చేసుకున్నారు. ఆ సమయంలో ఈ ప్రాంతము కరువు ప్రాంతంగా ఉండేదని చెప్పారు. కరువు ప్రాంతాలుగా ప్రకటించిన చోట తహశీల్దార్ అనుమతి తీసుకొని బోర్ వేయాల్సి ఉంటుందన్నారు. ఎవరైనా బోర్ వేస్తే కలెక్టర్ కు ఫిర్యాదు చేసి నిలిపి వేయించిన రోజులు ఉండేవన్నారు. బీఆర్ఎస్ పాలనలో చేపట్టిన సాగునీటి ప్రాజెక్టుల వల్ల తెలంగాణలో సాగు నీటికి ఇబ్బందులు తొలగిపోయాయని చెప్పారు. కేసీఆర్ చేపట్టిన సాగునీటి ప్రాజెక్టులయిన కాళేశ్వరం, పాలమూరు రంగారెడ్డి, సీతారామ, దిండి ఎత్తిపోతల పథకాలు, మిషన్ కాకతీయ పథకం కింద చెరువుల పునరుద్ధరణ, చెక్ డ్యాంల నిర్మాణం వల్ల భూగర్భ జలాలు ఆరు మీటర్లు పెరిగి రాష్ట్రం సస్యశ్యామలంగా మారిందన్నారు. సత్తుపల్లి, అశ్వారావుపేట సముద్రతీరానికి 100 కిలోమీటర్ల దూరంలో ఉంటాయని చెప్పారు. దీని వల్ల గాలిలో తేమ శాతం సరిపోయేంత ఉండడం వల్ల అక్కడ మాత్రమే పామాయిల్ పంట పండుతోందన్నారు. ఖమ్మం జిల్లా పర్యటనకు పోయినప్పుడు అక్కడ పామాయిల్ రైతులను చూసి ఆశ్చర్య పోయానని చెప్పారు. పామాయిల్ తోటలకు కోతుల బాధ లేదు. చీడ పట్టే బాధ లేదు. ఒక్కసారి పెడితే 30 ఏళ్ల వరకు నెలనెలా జీతం పడినట్టు ఆదాయం వస్తోందని అక్కడి రైతులు తెలిపారని చెప్పారు. సిద్దిపేటకు పామాయిల్ పంట తీసుకొద్దామని ప్రయత్నం చేసిన తొలినాళ్లలో ఇక్కడ ఆయిల్ ఫామ్ సాగు సాధ్యం కాదన్నారని చెప్పారు. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆయిల్ రీసెర్చ్(ఐఐఓఆర్) వారు చెప్పితే తప్ప ఇక్కడ పామాయిల్ సాగు చేయలేమని అధికారులు చెప్పారన్నారు. గాలిలో తేమ శాతం తక్కువగా ఉందని, ఇక్కడ పామాయిల్ సాగు జరగదు అని తేల్చి చెప్పారని గుర్తు చేసుకున్నారు.కేసీఆర్ చేపట్టిన ప్రాజెక్టుల వల్ల తెలంగాణ ప్రాంతమంతా పామాయిల్ పంట సాగుకు అనుకూలంగా మారిందన్నారు. 2019లో అనంతగిరి, రంగనాయక సాగర్, మల్లన్న సాగర్, కొండ పోచమ్మ సాగర్ తోపాటు చెరువులు, చెక్ డ్యాంల్లో నీళ్లు నింపినట్లు తెలిపారు. ఐ ఐ ఓ ఆర్ 2021లో పరిశోధన చేసి గాలిలో తేమ శాతం పెరిగిందని ఇక్కడ పామాయిల్ సాగు చేసుకోవచ్చు అని ప్రకటించిందన్నారు. కేసీఆర్ కలల ప్రాజెక్టు కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల ఈ ప్రాంతంలో ఆయిల్ ఫాం సాగు అవుతొందన్నారు. రైతుల జీవితాల్లో వెలుగులు రావడానికి, బోరు బండ్లు మాయం కావడానికి కారణం కాళేశ్వరం ప్రాజెక్టు అని చెప్పారు. చిన్నకోడూరు మండలంలో కంప్యూటర్ సైన్స్ చదివిన వ్యక్తి నెలకు రూ.60 వేల వేతనం వచ్చే ఐటీ ఉద్యోగం వదిలి పామ్ ఆయిల్ సాగు చేస్తున్నారని చెప్పారు.ఆయన మంచి ఆదాయం ఉంది అని సంతోషం వ్యక్తం చేశాడన్నారు. వరి పండుతుంది కానీ ఎకరానికి 30,000 కంటే ఎక్కువ మిగులదని చెప్పారు. దీనికి తోడు ప్రస్తుతం రేవంత్ రెడ్డి పుణ్యమాని ఎరువులు దొరకక వరి సాగు కష్టంగా మారిందన్నారు. ఆయిల్ ఫామ్ సాగు లాభసాటిగా మారి రైతుకు ప్రతినెల జీతం పడ్డట్టు ఆదాయం వస్తుందని చెప్పారు. 2022 జూన్ 5 వ తేదీన నంగునూరు మండలం రామచంద్రాపూర్ లో మడప ఎల్లారెడ్డి అనే రైతు పొలంలో మొదటి పామాయిల్ మొక్క నాటానని తెలిపారు.ఒక్కొక్క రైతును గుర్తించి ఒక్కొక్క ఎకరం పెట్టించి ఈరోజు కర్మాగారం ప్రారంభించుకునే దశకు వచ్చామన్నారు. ఈ ప్రాంత రైతుల కల నెరవేరిందని భావోద్వేగానికి గురయ్యారు. చుట్టుపక్కల ఐదు జిల్లాల రైతులకు ఈ కర్మాగారం వర ప్రదాయని కాబోతున్నదన్నారు.
-,విత్తనం నాటింది బీ ఆర్ ఎస్..ఫలాలు తింటున్నది కాంగ్రెస్...
సిద్ధిపేట జిల్లా నంగునూరు మండలం నర్మెట లో పామ్ ఆయిల్ తోటలతో విత్తనం నాటడంతో పాటు కర్మాగారానికి పునాది వేసింది బీఆర్ఎస్...అయితే ఫలాలు తినడానికి మాత్రం కాంగ్రెస్ వాళ్లు..బయలుదేరారని చెప్పారు. ఈ కర్మాగారం రావడం వెనుక కష్టం ఎవరిది? తంటాలు పడింది ఎవరు? చెమట చుక్కలు చిందించింది ఎవరు అనేది ప్రజలకు తెలుసునని అన్నారు. బీ ఆర్ ఎస్ హయాంలో 2022 ఏప్రిల్ నెలలో ఆనాటి వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి చేతుల మీదుగా ఈ కర్మాగారానికి శంకుస్థాపన చేసినట్లు తెలిపారు. పామాయిల్ కు పుట్టినిల్లు మలేషియా అనీ అక్కడి టెక్నాలజీ బాగుందని భావించి ఆ టెక్నాలజీతో ఇక్కడ కర్మాగారాన్ని నిర్మించినట్లు తెలిపారు. భారతదేశంలో ఏ పామ్ ఆయిల్ ఫ్యాక్టరీలో అయినా వంద టన్నుల గెలలు పంపితే 19 టన్నుల ఆయిల్ మాత్రమే వస్తుందన్నారు. నర్మెటలో నిర్మించిన ఫ్యాక్టరీలో 100 టన్నుల గెలల నుంచి 20 టన్నుల పామాయిల్ వస్తుందని తెలిపారు. ఈ లాభాలు రైతుకే వస్తాయన్నారు. గోద్రెజ్, నవ భారత్, పతంజలి కంపెనీ వాళ్ళు వచ్చి ఈ టెక్నాలజీని చూసి పోతున్నారని చెప్పారు. తాము పడ్డ కష్టానికి ఫలితం వచ్చిందని సంతోషం వ్యక్తం చేశారు. ఫ్యాక్టరీ నిర్మాణంలో ఏమాత్రం కష్టపడని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాత్రం రిబ్బను కత్తిరించడానికి కత్తెర జేబులో పెట్టుకొని బయలుదేరాడని ఎద్దేవా చేశారు. ప్రతి జిల్లాకు ఒక పామాయిల్ ఫ్యాక్టరీ పెట్టాలని కే సీ ఆర్ ఆలోచించారని చెప్పారు. పది లక్షల ఎకరాల్లో పామాయిల్ సాగు కోసం ప్రణాళికలు కూడా సిద్ధం చేశారన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో నిలిచి పోయిందన్నారు.మళ్ళీ కేసీఆర్ వస్తారని, జిల్లాకు ఒక పామాయిల్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేస్తారని పేర్కొన్నారు. వరి, మొక్కజొన్న పంటల్లో రూ.60 వేల నుంచి రూ.70 వేల కంటే లాభం లేదన్నారు. ఇక ముందు లాభసాటి పంట అయిన పామాయిల్ ను రైతులు సాగు చేయాలని కోరారు. పామాయిల్ తోటల్లో కోకో పంటల సాగు వైపు అడుగులు వేయాలని సూచించారు. రైతు సంక్షేమమే ద్యేయంగా కేసిఆర్ ప్రభుత్వం పనిచేసిందని జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి అన్నారు. ఎమ్మెల్సీ యాదవరెడ్డి మాట్లాడుతూ ఈ రెండు సంవత్సరాల కాంగ్రెస్ ప్రభుత్వంలో రాష్ట్రం పది సంవత్సరాలు వెనుక్కపోయిందన్నారు. సిద్దిపేట అభివృద్ది అన్ని రంగాల్లో హరీష్ రావుతో జరిగిందని ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్ అన్నారు. ఆయిల్ పామ్ సాగుతో సాగుచేసిన ప్రతి రైతుకు లాభం జరుగుతుందన్నారు. కేసిఆర్ సిద్దిపేటను హరీష్ రావు కు అప్పగించడం అంటేనే అభివృద్ది చేయడం కోసమని, ఈరోజు ఇంత అభివృద్ది జరిగిందంటే హరీష్ రావు వల్లనేనని తెలిపారు. దేశంలో ఎక్కడలేని మెజార్టీ రావడం, ఓటమికి లేకుండా హరీష్ రావు విజయం సాధించాడంటేనే హరీష్ రావు పట్టదల,కృషి అర్థమవుతుందన్నారు.ఎవరెవరో వస్తరు పోటోలు దిగుతరు కాని కష్టపడి ఆయిల్ పామ్ కర్మాగారం తెచ్చింది ఎవరో అందరికి తెలుసునని ఎమ్మెల్యే ప్రభాకర్ రెడ్డి విమర్శించారు. కార్యక్రమంలో మండల నాయకులు వెంకట్ రెడ్డి. డి.మల్లయ్య, జాప శ్రీకాంత్ రెడ్డి,ఎడ్ల సోమిరెడ్డి, రమేష్ గౌడ్, మైపాల్ రెడ్డి, కిష్టారెడ్డి, లింగంగౌడ్, రాజిరెడ్డి, రంగు రాజు గౌడ్, వేణు చక్రవర్తి, స్థానిక మాజీ ప్రజా ప్రతినిధులు, నాయకులు అబ్దుల్ అజీజ్, శనిగరం బాబు, ఎన్.శ్రీనివాస్, ఎన్, రవీందర్ రెడ్డి, నారాయణ, నాగేంద్రం,మల్లేశం,పద్మారెడ్డి, శ్రీకాంత్,కనకయ్య తదితరులు పాల్గొన్నారు. కాగా జనగామ,గజ్వేల్, దుబ్బాక సిద్దిపేట నియోజకవర్గాలకు చెందిన బిఆర్ ఎస్ నాయకులతో ఫాటు రైతులు పాల్గొన్నారు.