Latest News

బాకీ కార్డుతో కాంగ్రెస్ మోసాలను ఎండగట్టాలి*

30 Sep, 2025 57 Views
Main Image

బాకీ కార్డుతో కాంగ్రెస్ మోసాలను ఎండగట్టాలి


- తన్నీరు హరీశ్ రావు, మాజీ మంత్రి, సిద్ధిపేట ఎమ్మెల్యే.


 సిద్ధిపేట, సెప్టెంబరు 30:


కాంగ్రెస్ పార్టీ మోసాలను, కాంగ్రెస్ పాలనను పాలనను ఎండగట్టేవిధంగా ప్రతి ఇంటికి కాంగ్రెస్ బాకీ కార్డును పంపిణీ చేయాలని, కాంగ్రెస్ పార్టీ కార్డు విషయంలో ప్రతి ఇంట్లో  చర్చ జరగాలని మాజీ మంత్రి సిద్ధిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్ రావు అన్నారు. సిద్దిపేట క్యాంప్ కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ బాకీ కార్డు విడుదల కార్యక్రమంలో  మాజీ మంత్రి హరీశ్ రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఎంత బాకీ పడింది? ఒక్కొక్క మహిళకు ఎంత రావాలి? ఒక్కొక్క రైతుకు ఎంత బకాయి పెట్టింది? ప్రతి ఇంటికి ఎంత బాకీ పడింది? అనే విషయాలు తెలిసేలా బాకీ కార్డు విడుదల చేస్తున్నామని తెలిపారు. వివిధ ప్రాంతాల్లో పనిచేస్తున్న వారు పండుగకు ఊర్లకు వస్తారని, అందరికీ తెలిసే విధంగా బుధవారం సిద్దిపేట నియోజకవర్గంలో ప్రతి ఇంటికి బాకీ కార్డు పంపిణీ చేయాలని బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు సూచించారు. 

ప్రతి గ్రామంలో గ్రామ నాయకులు, గ్రామ శాఖ అధ్యక్షులు, మాజీ సర్పంచులు, ఎంపీటీసీలు, సీనియర్ నాయకులు అందరు కలిసి ప్రతి ఇంటికి పోయి ఈ బాకీ కార్డుని అందజేయాలన్నారు. కాంగ్రెస్ పార్టీ ఆ ఇంటికి ఎంత బాకీ పడిందో వివరించాలని చెప్పారు. రైతు బంధు పథకం పేరు మార్చి రైతు భరోసా కింద ఎకరానికి రూ.15వేల పంటసాయం చేస్తామని కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చిందన్నారు. పోయిన వానాకాలం రైతు బంధు మొత్తానికే ఇవ్వలేదని చెప్పారు. పోయిన యాసంగిలో మూడెకరాల వారికి మాత్రమే ఇచ్చి మిగతా వాళ్లందరికీ ఇవ్వలేదని చెప్పారు.  పంచాయతీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని 12,000 ఇచ్చిండు. మిగతా మూడు వేలు ఎగ్గొట్టారని విమర్శించారు. ఈ లెక్కన  ప్రతి రైతుకు కాంగ్రెస్ పార్టీ రూ.75 వేలు రైతుబంధు బాకీ పడిందన్నారు. రైతు బంధు కౌలు రైతుకి ఇస్తామన్నారని, ఒక రూపాయి అయినా కౌలు రైతుకు ఇచ్చారా? అని ప్రశ్నించారు.

కరోనా వచ్చినపుడు కేసీఆర్ ఎమ్మెల్యేలు, మంత్రుల జీతాలు బంద్ పెట్టి రైతులకు రైతు బంధు ఆపలేదన్నారు. పెద్ద రైతులకు రైతు బంధు ఇస్తున్నారని కాంగ్రెస్ పార్టీ అబద్ధాలు ప్రచారం చేసిందని విమర్శించారు. "రాష్ట్రంలో సీలింగ్  చట్టం ఉంది. ఒక్కరికి 54 ఎకరాల కంటే ఎవరికీ ఎక్కువ భూమి ఉండదు25 ఎకరాల మీద ఎంతమందికి తెలంగాణలో భూమి ఉంది అని లెక్క తీస్తే మూడు శాతం మాత్రమే ఉన్నారు" అని చెప్పారు. పది  ఎకరాల లోపు భూమిని కల్గిన రైతులు రాష్ట్రంలో 97 శాతం మంది ఉన్నారని తెలిపారు. ఈ విషయం సీ ఎం కుర్చీలో కూర్చుంటే కేసీఆర్ చేసిందిసబబే అని రేవంత్ రెడ్డికి అర్థమైందన్నారు. కాంగ్రెస్ పార్టీ రూ.4,000 ల పెన్షన్ ఇస్తామని హామీ ఇచ్చి ఇప్పటివరకు అమలు చేయలేదన్నారు. 

అత్తకు, కోడలు ఇద్దరికీ పెన్షన్ ఇస్తామని రేవంత్ రెడ్డి గజినీ కాంత్ మాటలు మాట్లాడారని ఆరోపించారు. ఇంటికొక మహిళకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం రూ.44వేల బాకీ పడిందన్నారు. 

మహిళలకు రూ.44 వేలు ఇచ్చిన తర్వాతనే కాంగ్రెస్ వాళ్ళు ఎవరైనా ఓటు అడగాలని డిమాండ్ చేశారు. 

వంద రోజుల్లో అమలు చేస్తామని చెప్పి 700 రోజులైనా ఆ దిశగా చర్యలు తీసుకోలేదని అన్నారు. మొదటి క్యాబినెట్ సమావేశంలో లోనే ఆరు గ్యారంటీలకు చట్టబద్ధత తెస్తామని,30 క్యాబినెట్ సమావేశాలైనా  వాటి ఊసే లేదన్నారు. ఇచ్చిన హామీల అమలు గురించి ఎవరైనా అడుగుతారేమో అని రాహుల్ గాంధీ తెలంగాణ ముఖం చూడడం లేదని విమర్శించారు.

 


"18 ఏళ్లు నిండిన ప్రతి అక్కకు చెల్లెకు మహాలక్ష్మి కింద రూ.2,500 ఇస్తామన్నారు. 

మాట్లాడితే మహిళలను కోటీశ్వరులని చేస్తామంటారు. ఎవరైనా అయ్యారా?" అని ప్రశ్నించారు. తాము విడుదల చేసిన బాకీ కార్డు స్థానిక సంస్థల ఎన్నికల్లో బ్రహ్మాస్త్రం అవుతుందన్నారు. ఇది కాంగ్రెస్ పార్టీ పాలిట ఉరితాడు అవుతుందని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వానికి యూరియా బస్తాలు ఇచ్చే తెలివి లేదు కానీ ఊరుకో మద్యం దుకాణం పెడుతున్నారని ఎద్దేవా చేశారు. తులం బంగారం ఏమైందని నిలదీశారు. రూ.5 లక్షల భరోసా ఒక విద్యార్థికైనా ఇచ్చారా అని ప్రశ్నించారు. రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని, కనీసం ఐదు వేల ఉద్యోగాలను కూడా ఇవ్వలేదన్నారు. కేసీఆర్ ప్రభుత్వం నోటిఫికేషన్ ఇచ్చి పరీక్ష పెట్టి ఫలితాలు ప్రకటిస్తే కాయితాలు పంచి తమ ఖాతాలో వేసుకున్నారని విమర్శించారు. నిరుద్యోగ భృతి రూ.నాలుగు వేలు ఇచ్చారా అని నిలదీశారు. జాబ్ క్యాలెండర్ జాబ్ లెస్ కేలండర్ అయిందన్నారు. రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేయలేదని విమర్శించారు. 

కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఎంతెంత బాకీ పడిందో స్పష్టంగా బాకీ కార్డ్ ద్వారా ప్రజలకు గుర్తు చేయాలని కార్యకర్తలకు సూచించారు. 

కేసీఆర్ చీరలు ఇచ్చారని తాము పట్టుచీరలు ఇస్తామని హామీ అమలు చేయలేదన్నారు. నీళ్ల విషయంలో అబద్ధాలు, నియామకాల విషయంలో అబద్ధాలు, నోరు తెరిస్తే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్ని అబద్ధాలే చెబుతున్నాడని విమర్శించారు. కేసీఆర్ కిట్టు, న్యూట్రిషన్ కిట్టు బంద్ అయ్యాయన్నారు. విద్యార్థుల ఫీజు రీయింబర్స్మెంట్ బంద్ అయిందని అన్నారు. కేసీఆర్ తొమ్మిది ఏళ్లలో రూ 20 వేల కోట్ల ఫీజు రీయింబర్స్మెంట్ డబ్బు చెల్లించారని పేర్కొన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ పిల్లలకు ఫీజులు కట్టకపోతే సర్టిఫికెట్లు లేని పరిస్థితి వచ్చిందని,చదువు చెప్పే సార్లకు జీతాలు లేవన్నారు. రేవంత్ రెడ్డి సగం కాలేజీలు మూతపడే విద్యాదానం చేశాడని విమర్శించారు. ఆరోగ్యశ్రీ డబ్బులు రాక దావఖానాల్లో సేవలు బంద్ అయ్యాయన్నారు.  కనీసం కేసీఆర్ కొనిచ్చిన ట్రాక్టర్లలో డీజిల్ కూడా పోయలేక పోతున్నారని ఆరోపించారు.పండుగ పూట కనీసం విద్యుత్ దీపాలు పెట్టలేని దుస్థితికి చేరిందన్నారు. ఆరు గ్యారంటీలకు టాటా చెప్పిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లంకె బిందెల వేట మొదలుపెట్టాడని విమర్శించారు. కంచ గచ్చిబౌలి, బంజారా హిల్స్, జూబ్లీహిల్స్ భూముల అమ్మాలని ప్రభుత్వం ప్రయత్నిస్తోందన్నారు.

సన్న వడ్లకు రూ.1300 కోట్ల రూపాయలు బోనస్ రైతులకు బాకీ పడ్డారని తెలిపారు.

తమిళనాడులో అక్కడి ప్రభుత్వం ఉదయం విద్యార్థులకు టిఫిన్ పెడుతోందని పొగిడిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేసీఆర్ ప్రారంభించిన సీఎం బ్రేక్ ఫాస్ట్ పథకాన్ని  ఎందుకు బంద్ పెట్టారని అడిగారు. కేసీఆర్

ప్రభుత్వ బడుల్లో విద్యార్థులకు కడుపు నిండా టిఫిన్ పెట్టారని, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత నిలిపివేశారని ఆరోపించారు. గ్రీన్ ఛానల్ ద్వారా హాస్టళ్లకి నిధులు విడుదల చేస్తామని చెప్పి కనీసం తిండి పెట్టలేని పరిస్థితికి దిగజార్చారని విమర్శించారు. ఫ్యూచర్ సిటీ పేరుతో లేని సిటీకి ఆరు లైన్ల రోడ్  నిర్మిస్తామంటున్న ప్రభుత్వం ఉన్న రోడ్లను మాత్రం పట్టించుకోవడం లేదని విమర్శించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం పర్సంటేజ్ లకు భయపడి కాంట్రాక్టర్లు టెండర్లు వేయని పరిస్థితి వచ్చిందన్నారు. డబ్బులు లేవు అంటూనే మల్లన్న సాగర్ నుండి మూసీ నదికి నీటిని ఎత్తిపోయడానికి రూ.7,000 కోట్లతో ప్రాజెక్టు ప్రారంభించారని విమర్శించారు.