మాయమై పోతున్నడమ్మ మనిషన్పవాడు..
మూగవోయిన అందెశ్రీ గొంతుక... అందే శ్రీ ఇక లేరు
ఆయన రాసిన ‘జయ జయహే తెలంగాణ’కు రాష్ట్ర గీతంగా గుర్తింపు
తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన అందెశ్రీ..
మాయమైపోతున్నడమ్మా’ పాటతో విస్తృత ప్రజాదరణ
సిద్దిపేట, నవంబర్ 10(అవనివిలేకరి)తెలంగాణ వైతాళికుడు ..సరస్వతి పుత్రుడు ,సాహితి ప్రేమికుడు ,సామజిక విప్లవకారుడు ప్రముఖ కవి తన పాటలతో సమాజాన్ని మేల్కొల్పి ఉర్రుతలూగించిన చరిత్రకారుడు అందెశ్రీ (64 ) ఇక లేరు ..ఆయన కంచుకంఠం మూగవోయింది … తెలంగాణ రాష్ట్ర గీతం ‘జయ జయహే తెలంగాణ’ రూపశిల్పి.. అసలు పేరు అందె ఎల్లయ్య 1961 జులై 18 న సిద్ధిపేట జిల్లా మద్దూరు మండలం రేబర్తి గ్రామంలో జన్మించారు. ఆయనకు ఆరోగ్యం సరిగా లేకపోవడంతో కుటుంబసభ్యులు ఆయన్ను హుటాహుటిన హైద్రాబాద్ లోని గాంధీ ఆసుపత్రికి తరలించారు ..చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు ..ఆయనకు ముగ్గరు కుమార్తెలు ,ఒక కుమారుడు…
అందెశ్రీ కలం నుంచి జాలువారిన ‘జయ జయహే తెలంగాణ’ గీతాన్ని తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర అధికారిక గీతంగా గుర్తించిన విషయం తెలిసిందే. తన పాటలు, రచనలతో ఆయన తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో కీలక పాత్ర పోషించారు. ఉద్యమ సమయంలో ఆయన గీతాలు ప్రజల్లో స్ఫూర్తిని రగిలించాయి. ఎటువంటి పాఠశాల విద్య అభ్యసించకుండా, కేవలం తన ప్రతిభతోనే గొప్ప కవిగా అందెశ్రీ పేరు తెచ్చుకున్నారు. ఆయన రాసిన ‘మాయమైపోతున్నడమ్మా మనిషన్నవాడు’ అనే గీతం తెలుగు ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయింది. ఈ పాట ఆయనకు విస్తృతమైన కీర్తిని తెచ్చిపెట్టింది. అందెశ్రీ మృతి పట్ల పలువురు ప్రముఖులు, సాహితీవేత్తలు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. ఆయన మరణం తెలుగు సాహిత్య లోకానికి తీరని లోటని విచారం వ్యక్తం చేశారు
ప్రముఖ కవి, తెలంగాణ రాష్ట్ర గీతం ‘జయ జయహే తెలంగాణ’ రూపశిల్పి అందెశ్రీ ఆకస్మికంగా కన్నుమూశారు. ఆయన మరణవార్తతో తెలంగాణ సాహితీ లోకం దిగ్భ్రాంతికి గురైంది. అందెశ్రీ మృతి పట్ల సీఎం రేవంత్ రెడ్డి, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.
సాహితీ శిఖరం నేలకూలింది
- సీఎం రేవంత్ రెడ్డి
అందెశ్రీ మరణం తెలంగాణ సాహితీ లోకానికి తీరని లోటని సీఎం రేవంత్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్ర గీతాన్ని రాసిన సమయంలో ఆయనతో జరిపిన సంభాషణలను ఈ సందర్భంగా గుర్తుచేసుకున్నారు. తెలంగాణ సాహితీ శిఖరం నేలకూలిందని, స్వరాష్ట్ర సాధనలో ఆయన చేసిన కృషి చిరస్థాయిగా నిలిచిపోతుందని కొనియాడారు. ఆయన కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.
తెలంగాణకు తీరని లోటు
- కేసీఆర్
మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కూడా అందెశ్రీ మృతి పట్ల తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం సాగిన సాంస్కృతిక ఉద్యమంలో తన పాటలతో, సాహిత్యంతో అందెశ్రీ కీలక పాత్ర పోషించారని అన్నారు. ఉద్యమ కాలంలో ఆయనతో తనకున్న అనుబంధాన్ని స్మరించుకున్నారు. ఆయన మరణం తెలంగాణకు తీరని లోటని పేర్కొన్నారు.
అందెశ్రీ మరణం పట్ల కేటీఆర్ సంతాపం..
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సైతం అందెశ్రీ అకాల మరణం పట్ల సంతాపం ప్రకటించారు. ఆయన మరణం తెలంగాణ సాహితీ రంగానికి, రాష్ట్రానికి పూడ్చలేని నష్టమని తెలిపారు. శోకసముద్రంలో మునిగిన వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ, ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు.
అందెశ్రీ మరణం తీరనిలోటు
-హరీష్ రావు
కవి ,గాయకుడు తెలంగాణ కోసం పరితపించిన వాగ్గేయకారుడు అందెశ్రీ చనిపోవడం బాధాకరమని ఆయన మరణం తెలంగాణకు తీరని లోటని మాజీ మంత్రి,సిద్ధిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీష్ రావు అన్నారు. అందెశ్రీ కుటుంబ సభ్యులకు సానుభూతిని తెలిపారు.