సిద్దిపేట,( అవనిప్రతినిధి)పీపుల్స్ వార్ మొదటి తరం నాయకుడు ఎదులాపురం బిక్షపతి(73) మంగళవారం రాత్రి గుండెపోటుతో మృతి చెందారు. వరంగల్ అర్బన్ జిల్లా హన్మకొండలోని వడ్డెపల్లికి చెందిన బిక్షపతికి పీపల్స్ వార్ వ్యవస్థాపకుడు కొండపల్లి సీతారామయ్య, కేజీ సత్యమూర్తి, వంటి నేతలతో సన్నిహిత సంబంధాలుండేవి.
1975లో ఆర్ ఈ సి విద్యార్థి జనార్దన్, ఎల్సీ కళాశాల విద్యార్ధి లంకా మురళీమోహన్రెడ్డి, హన్మకొండ జూనియర్ కళాశాలకు చెందిన విద్యార్థులు సుధాకర్, ఆనందరావు.. పీపుల్స్ వార్ పార్టీ విస్తరణలో భాగంగా మెదక్ జిల్లాకు వచ్చారు. ఇందిర హయాంలో ఎమర్జెన్సీ విధించిన నెల రోజులకే వీరు పోలీసులకు చిక్కారు. వీరితోపాటు బిక్షపతిని కూడా పోలీసులు పట్టుకున్నారు. మెదక్ జిల్లాలోని గిరాయిపల్లి వద్ద జరిగిన ఎన్ కౌంటర్లో ఈ నలుగురు విద్యార్థులు మృతి చెందారు. ఈ ఘటనకు ప్రత్యక్ష సాక్షిగా ఉన్న బిక్షపతి.. విద్యార్థులను చెట్టుకు కట్టేసి కాల్చి చంపారని వెల్లడించడం అప్పట్లో సంచలనం సృష్టించింది. ఘటనపై అప్పటి ప్రభుత్వం జస్టిస్ భార్గవ నేతృత్వంలో విచారణ కమిషన్ ను నియమించింది. అప్పటి ప్రముఖ జర్నలిస్టు అరుణ్ శౌరి వరంగల్ కు వెళ్లి బిక్షపతిని ఇంటర్వ్వూ చేశారు.