Latest News

మావోయిస్టు రాంచెంద్రారెడ్డి మృతదేహం వద్ద నివాళులు అర్పించిన ప్రజలు, బంధు మిత్రులు,కవులు,కళాకారులు, పౌరహక్కుల నేతలు,ప్రజాసంఘాలు.

18 Oct, 2025 191 Views
Main Image
పోరాటాలు ఆపడం ఎవరితరం కాదు..
అమరత్వం మొదటిదికాదు చివరిది కాదు..
ఏదో రూపంలో విప్లవం ముందుకు సాగుతుంది 
మావోయిస్టు రాంచెంద్రారెడ్డి మృతదేహం వద్ద నివాళులు అర్పించిన ప్రజలు, బంధు మిత్రులు,కవులు,కళాకారులు, పౌరహక్కుల నేతలు,ప్రజాసంఘాలు.
సిద్దిపేట/ హుస్నాబాద్, అక్టోబర్ 18(అవనివిలేకరి)పోరాటం ఏదో ఒక రూపంలో ముందుకెళ్తుందని పోరాటాన్ని ఆపడం ఎవరి తరం కాదని ప్రజాసంఘాల నాయకులు , కవులు, రచయితలు , వివిధ సంఘాల నాయకులు, పౌరహక్కుల నేతలు అన్నారు. శనివారం తెల్లవారుజామున సిద్దిపేట జిల్లా కోహెడ మండలం తీగలకుంటపల్లికి మావోయిస్టు నేత ఖాతా రాంచంద్రారెడ్డి మృతదేహం చేరుకోగా  శనివారం పెద్ద ఎత్తున విప్లవ సానుభూతిపరులు, నాయకులు, ప్రజలు, వివిధ పార్టీల నాయకులు, విరసం నేతలు, పౌర హక్కుల సంఘాల నాయకులు మృతదేహం వద్ద నివాళులు అర్పించి నినాదాలు చేశారు. బూటకపు ఎన్ కౌంటర్లు చేస్తూ  కేంద్రప్రభుత్వం  ప్రజాపోరాలను అణిచివేయాలని చూస్తుందని నివాళులు  అర్పించిన సందర్బంగా పలువురు ప్రజాసంఘాల నాయకులు , టిఆర్ఎస్ నేతలు, పార్టీల నాయకులు తెలిపారు.  ప్రజాద్రోహులను ప్రజలు తరిమికొట్టాలని, ప్రజల కోసం పోరాడేవారు చరిత్రలో నిలుస్తారన్నారు. ప్రజల కోసం ఆయుధాలు పట్టారని అటువంటి ఆయుధాలను శత్రువుకు అప్పగించి లొంగిపోయి పార్టీకి ద్రోహం చేయడం సహించరానిదన్నారు. రాంచెంద్రారెడ్డి సజీవంగా ఉన్నప్పుడు పోరాటంచేశాడని, చనిపోయిన తర్వాత కూడా 26 రోజులు పోరాటం చేశాడన్నారు.గత నెల సెప్టెంబర్ 22వ తేదీ ఛత్తీస్ గడ్ అంబుజ్ మాడ్ ఎన్ కౌంటర్ లో రాంచంద్రారెడ్డి మృతి చెందారు. రామచంద్రారెడ్డిది బూటకపు ఎన్ కౌంటర్ అని మృతదేహానికి రీపోస్టుమార్టం నిర్వహించాలని కుటుంబ సభ్యులు ఛత్తీస్ గడ్ హైకోర్టును ఆశ్రయించారు. అక్కడ జాప్యం జరగడంతో సుప్రీంకోర్టును ఆశ్రయించారు. హైకోర్టులో విచారణ జరుగుతుండగా తాము జోక్యం చేసుకోలేమని సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది. దీంతో మృతదేహాన్ని 26 రోజుల తర్వాత స్వగ్రామం తీగలకుంటపల్లికి తీసుకువచ్చి కుటుంబ సభ్యులు దహన సంస్కారాలు నిర్వహించారు. రాంచంద్రారెడ్డి మృతి దేహానికి మావోయిస్టు సానుభూతిపరులు నివాళులర్పించిన అనంతరం విప్లవ నినాదాల, విప్లవ పాటల మధ్యన దాదాపు నాలుగు గంటలపాటు అంతిమయాత్రకొనసాగింగి. విరసం సభ్యులు, కవులు,కళాకారులు,  విరసం కవి వేణుగోపాల్,  పౌరహక్కుల సంఘం నాయకులు లక్ష్మణ్, నారాయణరావు,  ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్, టిఆర్ ఎస్ రాష్ట్ర నాయకులు, మాజీ కార్పోరేషన్ చైర్మన్ దేవి ప్రసాద్ రావు, నందిని సిధారెడ్డి, పాణి, గాదె ఇన్నయ్య, మంద పవన్, మల్లారెడ్డి, సత్తయ్య, తదితరులు నివాళులు అర్పించి అంతిమ యాత్రలో పాల్గొన్నారు.రామచంద్రరెడ్డి భౌతిక కాయానికి రీ పోస్టుమార్టం చేయాలని సుప్రీంకోర్టులో కేసు నడుస్తుండడంతో, రీ పోస్టుమార్టం చేయడానికి అనుగుణంగా మృత దేహాన్ని బాక్స్ లో పెట్టి సమాధి చేశారు. సుప్రీంకోర్టు రీ పోస్టుమార్టం చేసేలా తీర్పునివ్వాలని పౌర హక్కుల సంఘం నేతలు, కుటుంబ సభ్యులు వేడుకుంటున్నారు. బూటకపు ఎన్ కౌంటర్ చేయడం దారుణమని రామచంద్రరెడ్డి భార్య శాంతిప్రియ ,కుమారుడు రాజా చంద్రారెడ్డి ఆరోపించారు.


- ఇది బూటకపు ఎన్ కౌంటరే..
 ఛత్తీస్ ఘడ్ ఎన్కౌంటర్ మృతుడు రామచంద్రారెడ్డి భార్య శాంతిప్రియ.


 తన భర్త రామచంద్రారెడ్డి ది ముమ్మాటికి బూటకపు ఎన్కౌంటరేనని ఛత్తీస్ ఘడ్ ఎన్కౌంటర్ మృతుడు రామచంద్రారెడ్డి భార్య శాంతిప్రియ అన్నారు. పార్టీలోని కొందరు కోవార్టుల వల్లనే పోలీసులు పట్టుకున్నారన్నారు. దాదాపు పదకొండు రోజులపాటు చిత్ర హింసలు పెట్టినా, ఎలాంటి సమాచారం ఇవ్వలేదని పోలీసులే చంపారని తెలిపారు. న్యాయం కోసం పోరాడినా తమకు న్యాయం లభించలేదన్నారు. కేంద్ర ప్రభుత్వం డెడ్ లైన్ విధించి మరి మావోయిస్టులను చంపుతుందన్నారు. పార్టీ చర్చలకు సిద్ధం అంటున్నా ప్రభుత్వం ఎందుకు వారితో మాట్లాడటం లేదని ప్రశ్నించారు.మావోయిస్ట్ సమస్యను పరిష్కరించాలంటే ముందుగా వారితో చర్చలు జరపాలన్నారు. వారు లేవనెత్తే అంశాలను పరిష్కరించడం ద్వారా ఈ సమస్యను పరిష్కరించాలన్నారు. మావోయిస్ట్ పార్టీలోని కొందరి లొంగుబాటుల్ని చూస్తే అనేక అనుమానాలు కలుగుతున్నాయన్నారు. ప్రభుత్వదినేతల ముందు ఆయుధాలు ఇస్తూ, నవ్వుకుంటూ, విందులు జరుపుకుంటూ లొంగుబాటు డ్రామాలు చేస్తున్నారు. లొంగుబాటుని వ్యతిరేకించడం వల్లనే బహుశా కోవర్ట్ ఆపరేషన్ జరిగి ఉంటుందని అనుమానం ఉందన్నారు

 - న్యాయం జరిగే వరకు మా పోరాటం ఆగదు.
- మావోయిస్టు రామచంద్రారెడ్డి కొడుకు రాజా చంద్రారెడ్డి 

 మా నాన్న ఎన్కౌంటర్ పై అనేక అనుమానాలు ఉన్నాయని, ఇది ముమ్మాటికి బూటకపు ఎన్కౌంటర్ అని మావోయిస్టు రామచంద్రారెడ్డి కొడుకు రాజా చంద్రారెడ్డి అన్నారు.  న్యాయం కోసం ఛత్తీస్ ఘడ్ హైకోర్టును ఆశ్రయించినా న్యాయం జరగ లేదన్నారు. మేము రీ పోస్ట్ మార్టం కోసం డిమాండ్ చేయడంతో, ఆఘమేఘాల మీద అక్కడే ఆయన అంత్యక్రియలు చేసే ప్రయత్నం జరిగిందన్నారు. తాము కోర్టును ఆశ్రయించడంతో త్వరగా బాడీని తీసుకెళ్లాలని ఒత్తిడి చేశారని తెలిపారు. కుటుంబ సభ్యుల సమక్షంలో పోస్టు మార్టం చేయకుండా మేం వెళ్ళే లోగానే, మాకు బాడీని చూపకుండానే పోస్టుమార్టం చేశారని తెలిపారు.  ఒకవైపు లొంగుబాట్లు, మరో వైపు ఎన్కౌంటర్ లు జరగడం చూస్తుంటే, చాలా మంది కోవర్ట్ లు గామారి, తోటి మావోయిస్టులను చంపిస్తున్నారన్నారు. మా నాన్న ఎన్కౌంటర్ పై వాస్తవాలు వెలుగు చూసే వరకు న్యాయం కోసం పోరాడుతామన్నారు. ఇప్పటికే సుప్రీంకోర్టు ను ఆశ్రయించడం జరిగిందన్నారు. సుప్రీం కోర్టు రీ పోస్టుమార్టం కోసం అనుమతిస్తుందని ఆశిస్తున్నామన్నారు. అందుకే మా నాన్న మృతదేహాన్ని దహనం చెయ్యకుండా, ఖననం చేస్తున్నామని స్పష్టం చేశారు.