Latest News

యూరియా సరఫరాలో ప్రభుత్వం విఫలం

24 Aug, 2025 56 Views
Main Image

యూరియా సరఫరాలో ప్రభుత్వం విఫలం

పోలీస్ పహారాలో యూరియా పంపిణి

నంగునూరు, ఆగస్టు 24(అవనివిలేకరి)యూరియా సరఫరా చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఉమ్మడి మెదక్ జిల్లా పరిషత్ మాజీ వైస్ చైర్మన్ రాగుల సారయ్య అన్నారు. ఆదివారం సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం పాలమాకులలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. వేకువ జాము మూడు గంటల నుండి రైతులు క్యూ లైన్ లో నిలబడి తీవ్ర ఇబ్బందులకు గురి అవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సకాలంలో అందవలసిన యూరియా ప్రభుత్వ నిర్లక్ష్యం వలన పంపిణీ కాక రైతులు  ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. రైతు సంక్షేమ ప్రభుత్వం అని చెప్పిన ప్రభుత్వం రాష్ట్రానికి వెన్నెముక లాంటి రైతుల వెన్ను విరుస్తోందని మండి పడ్డారు. రోజుల తరబడి యూరియా కోసం రైతులు పడిగాపులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వచ్చిన యూరియాను అనేక షరతులు విధించి పంచుతూ రైతులను ఇబ్బందులకు గురి చేస్తున్నారన్నారు. ఇంతకు ముందు ఒక బస్తా, రెండు బస్తాలు తీసుకున్న రైతులకు యూరియా ఇవ్వడం లేదని వాపోయారు. ఒక రైతుకు ఒక బస్తా మాత్రమే ఇస్తున్నారని అన్నారు. పోలీసుల పహారాలో యూరియా పంచుతూ రైతులను భయభ్రాంతులకు గురి చేస్తున్నారని ఆరోపించారు. రైతులకు చేస్తామన్న రుణమాఫీ, ఇస్తామన్న రైతు బంధు పథకాలను పూర్తి స్థాయిలో అమలు చేయడంలో ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. ఇప్పటికైనా ప్రభుత్వం మొద్దు నిద్ర వీడి రైతులకు సరిపడే యూరియా పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో మాజీ ఏఎంసీ వైస్ చైర్మన్ వర్దోలు వేణు చక్రవర్తి, బీఆర్ఎస్ నాయకులు వేల్పుల అయిలయ్య,  పరుశరాములు గౌడ్, పంగ కుమార్, బెదురు తిరుపతి, చింటూ, సోహెల్, సాగర్, చిన్న తదితరులు పాల్గొన్నారు