Latest News

యావత్ తెలంగాణ ప్రజలు జూబ్లీహిల్స్ వైపు చూస్తున్నారు

13 Oct, 2025 103 Views
Main Image
జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక రాష్ట్రానికి చాలా ముఖ్యమైన ఎన్నిక, 
యావత్ తెలంగాణ ప్రజలు జూబ్లీహిల్స్ వైపు చూస్తున్నారు
- మాజీ మంత్రి హరీష్ రావు 
హైదరాబాద్,అక్టోబర్ 13(అవనిప్రతినిధి)జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక రాష్ట్రానికి చాలా ముఖ్యమైన ఎన్నిక అని, యావత్ తెలంగాణ ప్రజలు జూబ్లీహిల్స్ వైపు చూస్తున్నారని మాజీమంత్రి, సిద్ధిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్ రావు అన్నారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గం బీఆర్ఎస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశం సోమవారం జరిగింది. ఈ సమావేశంలో తన్నీరు హరీశ్ రావు మాట్లాడుతూ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారంటీలు వంద రోజుల్లో అమలు చేస్తామని హామీ ఇచ్చి, బాండ్ పేపర్లు రాసి ఇచ్చారని, అధికారంలోకి వచ్చి వంద రోజలు కాదు, ఏడు వందల రోజులు దాటినా అమలు చేయడం లేదని చెప్పారు. అందుకే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి జూబ్లీ హిల్స్ ఎన్నికల్లో సురుకు తగలాలని తెలంగాణ ప్రజలు కోరుకుంటున్నారని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ చిత్తు చిత్తుగా ఓడితేనే రేవంత్ రెడ్డికి కనువిప్పు కలుగుతుందని రాష్ట్ర ప్రజలు ఎదురు చూస్తున్నారని చెప్పారు.కాంగ్రెస్ పార్టీ ఓడిపోకపోతే ఆరు గ్యారెంటీలు ఎగ్గొట్టినా, హామీలు అమలు చేయకపోయినా, హైడ్రా పేరిట పేదల ఇండ్లు కూల్చినా తమకే ఓటు వేసారని రేవంత్ రెడ్డి ప్రచారం చేసుకుంటాడని ఆరోపించారు.ఉద్యోగాలు, పింఛన్లు రావాలన్నా, పథకాలు అమలు కావాలన్నా, హైడ్రా ఆగాలన్నా బిఆర్ఎస్ పార్టీ గెలవాలని చెప్పారు.రెండేళ్లలో రేవంత్ రెడ్డి రాష్ట్రాన్ని అవినీతిమయం చేశారని ఆరోపించారు. తెలంగాణను కేసీఆర్ ఆదర్శ రాష్ట్రంగా తీర్చిదిద్దితే, అత్యంత అవినీతి రాష్ట్రంగా రేవంత్ రెడ్డి తయారు చేశాడని ఆరోపించారు.  భవనాల అనుమతికి చదరపు అడుగుకు కు రూ.75లు, ఫైనాన్స్ బిల్లు క్లియర్ కావాలంటే 12 శాతం కమిషన్ ఇవ్వాల్సిన దుస్థితి నెలకొందన్నారు. భూముల సమస్యలు పరిష్కారం కావాలంటే 40 శాతం భూములు రాసివ్వాలని, ఇలా మొత్తం పర్సెంటేజీల మయమైందని వాపోయారు. ఒకప్పుడు తెలంగాణ పెట్టుబడులకు స్వర్గధామం అని, అప్పట్లో తెలంగాణ ఏ పథకం ప్రారంభిస్తే దేశం మొత్తం ఆ పథకం ప్రారంభించేదన్నారు. తెలంగాణ అనుసరిస్తే, దేశం ఆచరించే పరిస్థితికి కేసీఆర్ తీసుకువచ్చారని తెలిపారు. రేవంత్ రెడ్డి పాలనతో తెలంగాణ పూర్వ వైభవం కోల్పోయిందన్నారు. ఎన్నికల ముందు అనేక హామీలు ఇచ్చి,గాంధీ టోపీలు పెట్టి ప్రజలను మోసం చేసారని దుయ్య.కేసీఆర్ 350 బస్తీ దవాఖానలు ప్రారంభించి, ఉచితంగా పరీక్షలు చేసే విధంగా వ్యాధి నిర్ధారణ కేంద్రాలు ప్రారంభించారని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం బస్తీ దవాఖానాలకు సుస్తీ పట్టించిందని ఎద్దేవా చేశారు. ఆరు నెలలుగా బస్తీ దవాఖానా వైద్య సిబ్బంది జీతాలు  చెల్లించడం లేదు, మందులు లేవు అన్నారు. వైద్య సిబ్బందికి జీతాలు ఇవ్వకుండా ప్రజలకు వైద్య సేవలు అందకుండా కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుందని ఆరోపించారు. బస్తీ దవాఖానాలు చూస్తే కేసీఆర్ గుర్తుకు వస్తారు, అందుకే బస్తీ దవాఖానల ఉనికి లేకుండా చేస్తున్నారని విమర్శించారు. నీటీ బిల్లులు అధికంగా వసూలు చేస్తున్నారని, కేటీఆర్ మున్సిపల్ మంత్రిగా ఉన్నపుడు 20 వేల లీటర్ల వరకు బిల్లులు లేవని స్పష్టం చేశారు. జూబ్లీహిల్స్ గెలుపు  మాగంటి సునీత గెలుపు మాత్రమే కాదని, తెలంగాణ ప్రజల గెలుపు, హైడ్రా బాధితుల గెలుపు, మహాలక్ష్మి రాని అక్కా చెల్లెళ్ల గెలుపు, పింఛన్లు రాని అవ్వా తాతల గెలుపు, నిరుద్యోగుల గెలుపు అని పేర్కొన్నారు. కాంగ్రెస్ ఓడినా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి పదవి పోదని, ప్రభుత్వం మారదని, రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులు ముఖ్యమంత్రి  రేవంత్ రెడ్డికి అర్థం కావాలంటే కాంగ్రెస్ పార్టీని చిత్తుగా ఓడించాలని పిలుపునిచ్చారు. హైడ్రా పేరుతో పెద్దోళ్ల ఇండ్లు కూల్చుతలేరని కేవలం పేదోళ్ల ఇండ్లు మాత్రమే కూల్చుతున్నారని ఆరోపించారు. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, మహేందర్ రెడ్డి, గాంధీ వంటి వారి ఇండ్లు, భూములు హైడ్రాకు ఎందుకు కనబడటం లేదని ప్రశ్నించారు. గరీబోళ్ల ఇండ్లే హైడ్రాకు కనబడుతున్నాయా? హైడ్రా కతం హోనాహే కాంగ్రెస్ కో హరానేహే హైడ్రా బంద్ హోనా తో  మాగంటి సునితకో జితానాహే. కాంగ్రెస్ గెలిస్తే మీ ఇండ్ల ముందుకు బుల్డోజర్ వస్తది.అది రావొద్దు అంటే సునితమ్మను గెలిపించాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు.ముస్లింలను కాంగ్రెస్ దారుణంగా మోసం చేసిందని, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, మంత్రి ఇవ్వలేదని ఆరోపించారు. కేసీఆర్ డిప్యూటీ సీఎం, హోం మినిస్టర్ పదవులు ముస్లింలకు ఇచ్చారని తెలిపారు. షాదీ ముబారక్ కింద తులం బంగారం ఇస్తామని హామీ ఇచ్చి అమలు చేయలేదని ఆరోపించారు. తులం బంగారం జాడ లేదు.. కల్యాణ లక్ష్మి చెక్కు ఏడాదైనా ఇవ్వడం లేదని పేర్కొన్నారు.కేసీఆర్ కిట్, బతుకమ్మ చీర, రంజాన్ తోఫా, ఓవర్సిస్ స్కాలర్ షిప్, దళిత బంధు, బీసీ బంధు బంద్ చేసి, బస్తీ దవాఖాన ఖతం పట్టించారని తెలియజేశారు. హిందూ, ముస్లీం అందరూ కలిసి హైద్రాబాద్ నూ, తెలంగాణనూ కాపాడుకోవాలని పిలుపునిచ్చారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో బీఆర్ఎస్ గెలుపు తెలంగాణ గెలుపు అని, ఇందుకోసం అందరం కలిసి కృషి చేయాలని చెప్పారు. జూబ్లిహిల్స్ కార్యకర్తలు బాగా కలిసి పనిచేస్తున్నారని.కేటీఆర్, తాను జూబ్లిహిల్స్ ను ఆనుకొని నివాసం ఉన్నామని పిలిస్తే పది నిమిషాల్లో మీకు అండగా వస్తామన్నారు. ఎవరూ భయపడవద్దు.. మీ ముందు నిమిషాల్లో ఉంటాం అని భరోసా ఇచ్చారు.కార్యకర్తలకు ఆపద వస్తే, మెసేజ్ చేస్తే తనతో పాటు, తలసాని, కేటీఆర్ కార్యకర్తల ముందుంటామన్నారు. ఉద్యమాలు, పోరాటాలు బీఆర్ఎస్ పార్టీకి కొత్తకాదని భయపడవద్దని జూబ్లిహిల్స్ గెలిపించి కేసీఆర్ బహుమతిగా ఇవ్వాలని చెప్పారు.కాంగ్రెస్ పార్టీ క్యాబినెట్ ను దించిందని, బీ ఆర్ ఎస్ కార్యకర్తలు నాయకులు కలిసి కట్టుగా కృషి చేయాలని కోరారు. విష్ణువర్ధన్ రెడ్డి సునితకు తమ్ముడిగా ఎంతో కృషి చేస్తున్నారని తెలిపారు. ఎక్కడ చూసినా కేసీఆర్ కు ఓటు వేస్తామంటున్నారని,పెద్ద మెజారిటీతో సునీతను గెలిపించాలని కోరారు.