నిజామాబాద్,అక్టోబర్ 20(అవనిప్రతినిధి) గత శుక్రవారం సీసీఎస్ కానిస్టేబుల్ ప్రమోద్ ను దారుణంగా హత్య చేసిన పాత నేరస్థుడు రియాజ్ సోమవారం పోలీసులు జరిపిన కాల్పుల్లో హతమయ్యాడు. కానిస్టేబుల్ ను హత్య చేసిన తర్వాత పరారైన రియాజ్ ను నిన్న పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా మరో వ్యక్తితో జరిగిన పెనుగులాటలో తీవ్రంగా గాయపడిన రియాజ్ ను నిజామాబాద్ ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అయితే చికిత్స పొందుతున్న రియాజ్ ఆసుపత్రి నుంచి పారిపోయేందుకు ప్రయత్నించినట్లు పోలీసుల కథనం. ఈ సందర్భంగా అతన్ని పట్టుకునేందుకు ప్రయత్నించిన కానిస్టేబుల్ నుంచి తుపాకీ లాక్కుని కాల్పులు జరిపేందుకు రియాజ్ ప్రయత్నించాడని, ఈ క్రమంలో పోలీసులు ఆత్మరక్షణ కోసం జరిపిన కాల్పుల్లో రియాజ్ మరణించినట్లు పోలీసులు వెల్లడించారు . పాత నేరస్థుడు రియాజ్ మృతి చెందినట్లు తెలంగాణా డీజీపీ శివధర్ రెడ్డి ప్రకటించారు. ఘటనపై ఆయన స్పందిస్తూ, తప్పించుకొని పారిపోతూ పోలీసులపై మరోసారి దాడికి పాల్పడినట్లు చెప్పారు. రియాజ్ ను పట్టుకునేందుకు పోలీసులు తీవ్ర ప్రయత్నం చేశారని, పోలీసుల దగ్గరున్న ఆయుధం తీసుకొని కాల్పులకు ప్రయత్నించాడన్నారు. మరోసారి కాల్పులు జరపడంతో పోలీసులు ఎదురుకాల్పలు జరిపారని, దీంతో రియాజ్ చనిపోయినట్లు చెప్పారు. నిన్న రియాజ్ ని పట్టుకునే క్రమంలో, కానిస్టేబుల్ పైనా, ఆసిఫ్ అనే వ్యక్తిపైనా దాడి చేశాడని, ఇవాళ మరొక కానిస్టేబుల్ ను గాయపరిచి పారిపోయేందుకు ప్రయత్నించినట్లు చెప్పారు. ఈ సందర్భంగా ఆత్మరక్షణ కోసం పోలీసులు జరిపిన కాల్పుల్లో రియాజ్ మరణించినట్లు డీజీపీ వివరించారు.