వీరులను కన్న తల్లి గోపగోని కొమురమ్మ
ప్రజాయుద్ద యోధులు గోపగోని ఐలన్న, గోపగోని కుమారస్వామి ల మాతృమూర్తి గోపగోని కొమురమ్మ (92) ఈ రోజు ఉదయం 11.35 గంటలకు స్వగ్రామమైన హుజురాబాద్ మండలంలోని తుమ్మనపల్లి లో వృద్దాప్యంతో తుది శ్వాస విడిచారు.తుమ్మనపల్లి గ్రామానికి చెందిన గోపగోని కొమురయ్య-కొమురమ్మ దంపతుల సంతానం ఐదుగురు కుమారులు గోపగోని లింగయ్య,ఐలయ్య,కుమార స్వామి,రాజమౌళి,సమ్మయ్య,కుమార్తె పద్మ. కొమురమ్మ భర్త కొమురయ్య గతంలోనే మరణించగా వీరి కుమారుల్లో ఒకరు పీపుల్స్ వార్ పార్టీ ఉత్తర తెలంగాణ రీజనల్ కార్యదర్శిగా పనిచేస్తున్న క్రమంలో 1988 లో కిడ్నాప్ కు గురై ఇంతవరకు ఆచూకిలేకుండా పోయాడు.ఈ కిడ్నాప్ వ్యవహారం అప్పటి నుండి ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా సంచలనంగా మారిపోయింది.మరో కుమారుడు గోపగోని కుమారస్వామి అలియాస్ రవన్న కూడా అంతకు ముందే 1979 లో గూడూరు కేంద్రంగా పల్లె కనుకన్న నాయకత్వంలో ఏర్పడిన మొట్టమొదటి దళంలో దళసభ్యునిగా పనిచేస్తూ గ్రెనేడ్ పేలిన ప్రమాదంలో చనిపోయాడు. పెద్దకుమారుడు గోపగోని లింగన్న ఇప్పటికి సామాజిక ఉద్యమాల్లో కొనసాగుతూ తన భాగస్వామ్యాన్ని అందిస్తున్నారు.