Latest News
సీఎం అందాల పోటీ మీద పెట్టిన శ్రద్ధ రైతు సమస్యలపై పెట్టలేదు
20 Aug, 2025
73 Views
సీఎం అందాల పోటీ మీద పెట్టిన శ్రద్ధ రైతు సమస్యలపై పెట్టలేదు
ముందు చూపులేని సీఎం వల్లనే యూరియా కొరత
*యూరియా కొరత తీర్చకపోతే కాంగ్రెస్ నాయకులను ఎక్కడికక్కడ అడ్డుకుంటాం
- తన్నీరు హరీశ్ రావు, మాజీ మంత్రి, సిద్ధిపేట ఎమ్మెల్యే
నంగునూరు, ఆగస్టు 20(అవనివిలేకరి)సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్రంలో ఎమర్జెన్సీ పాలన తెచ్చాడని, రేవంత్ రెడ్డి అందాల పోటీ మీద పెట్టిన శ్రద్ధ, యూరియా సరఫరా మీద పెట్టలేదని మాజీ మంత్రి, సిద్ధిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్ రావు అన్నారు. సిద్దిపేట జిల్లా నంగునూరు మండల కేంద్రంలో బుధవారం బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీశ్ రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటి వరకు ఒక్కసారి కూడా సమీక్ష చేయకుండా ఇంతటి దుస్థితి తెచ్చాడు అని ఆరోపించారు. కేసీఆర్ రైతులకు అగ్ర తాంబూలం ఇస్తే.. రేవంత్ రెడ్డి రైతులను అత:పాతాళంలో పడేశారని చెప్పారు. కేసీఆర్ గోదావరి జలాలతో రైతుల పాదాలు కడిగితే... రేవంత్ రెడ్డి యూరియా కోసం రైతులతో పోలీసుల కాళ్లు మొక్కిస్తున్నారని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో యూరియా కొరతతో రైతులు నానా అవస్థలు పడుతున్నారని, యూరియా కొరతతో రైతులకు కంటి నిండా నిద్ర పట్టడం లేదన్నారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం మాత్రం కుంభ కర్ణుడిలా నిద్రిస్తోందన్నారు. పాలనలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలం అయిందన్నారు. సగం మంది రైతులకు రుణమాఫీ కాలేదని చెప్పారు.వడ్లు అమ్మి మూడు నెలలు అయినా రైతులకు రూ.1300 కోట్ల బోనస్ డబ్బులు ఇవ్వలేదన్నారు. బడే బాయ్ నరేంద్ర మోడీ, చోటా బాయ్ రేవంత్ రెడ్డి కలిసి రైతులకు అన్యాయం చేశారని ఆరోపించారు. రైతులు యూరియా కొరతతో అల్లాడుతుంటే కాంగ్రెస్, బీజేపీ ఎంపీలు ఏం చేస్తున్నారని నిలదీశారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటివరకు సీఎం రేవంత్ రెడ్డి 51సార్లు డిల్లీ వెళ్ళి సాధించారని ప్రశ్నించారు. సీఎం రేవంత్ రెడ్డి నోరు విప్పితే కేసీఆర్ తిట్టడం తప్ప సాధించింది ఏమిటి అని ప్రశ్నించారు. వెంటనే రైతులకు యూరియా అందించాలని, లేకుంటే యూరియా కోసం ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. యూరియా ఇవ్వని కాంగ్రెస్ నాయకులకు గ్రామాల్లో తిరిగే హక్కు లేదన్నారు. ఊర్లలో కాంగ్రెస్ మంత్రులను, కాంగ్రెస్ నేతలను తిరగనివ్వమని, ఎక్కడిక్కడ అడ్డుకుంటామని పేర్కొన్నారు.