Latest News

సమాచార హక్కు చట్టాన్ని పటిష్టంగా అమలు చేయాలి

16 Sep, 2025 88 Views
Main Image

సమాచార హక్కు చట్టాన్ని

పటిష్టంగా అమలు చేయాలి


రాష్ట్ర ప్రధాన సమాచార కమిషనర్ డాక్టర్ జి. చంద్రశేఖర్ రెడ్డి


సిద్దిపేట, సెప్టెంబర్ 16 (అవని విలేఖరి)సమాచార హక్కు చట్టం (ఆర్టీఐ)–2005ను అధికారులు పటిష్టంగా అమలు చేయాలని రాష్ట్ర ప్రధాన సమాచార కమిషనర్ డాక్టర్ జి. చంద్రశేఖర్ రెడ్డి సూచించారు.సిద్దిపేట కలెక్టరేట్‌లో మంగళవారం నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో ఆయనతో పాటు రాష్ట్ర సమాచార కమిషనర్లు బొరెడ్డి అయోధ్య రెడ్డి,

 దేశాల భూపాల్, పీవీ శ్రీనివాస్ రావు,  మొహసీనా పర్వీన్, జిల్లా కలెక్టర్ కె. హైమావతి, పోలీసు కమిషనర్ డాక్టర్ అనురాధ, జిల్లా అదనపు కలెక్టర్ (లోకల్ బాడీ) గరీమ అగ్రవాల్ తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా డాక్టర్ చంద్రశేఖర్ మాట్లాడుతూ, సిద్దిపేట జిల్లాలో ఆర్టీఐ దరఖాస్తులు తక్కువగా పెండింగ్‌లో ఉండటాన్ని అభినందించారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న సుమారు 17,000 పెండింగ్ దరఖాస్తులను పరిష్కరించేందుకు కమిషన్ జిల్లా వారీగా పర్యటిస్తోందని తెలిపారు. ప్రతి సంవత్సరం రాష్ట్రంలో సుమారు 1.5 లక్షల మంది ఆర్టీఐ ద్వారా సమాచారం కోరుతున్నారని చెప్పారు.

దరఖాస్తుదారులు కోరిన సమాచారాన్ని హార్డ్, సాఫ్ట్ కాపీగా లేదా ప్రత్యక్షంగా వీక్షించే అవకాశముందని చెప్పారు. తెల్ల రేషన్ కార్డు కలిగిన వారు ఉచితంగా సమాచారం పొందవచ్చని, మిగతావారు రూ.10 కోర్ట్‌ఫీ చెల్లించాల్సి ఉంటుందని తెలిపారు. అలాగే 4(1బి), 6(1) ప్రకారం అధికారులు స్పష్టమైన సమాచారం అందించాల్సి ఉంటుందని, ప్రతి కార్యాలయంలో పిఐఓలు, ఏపిఐఓలు అందుబాటులో ఉండాలని సూచించారు.

జిల్లా కలెక్టర్ కె. హైమావతి మాట్లాడుతూ, ప్రభుత్వ పాలనలో పారదర్శకత, అధికారుల్లో జవాబుదారీతనం పెంచేందుకు ఆర్టీఐ చట్టం ఎంతో దోహదం చేస్తుందని పేర్కొన్నారు. జిల్లాలో పెండింగ్‌లో ఉన్న 170 ఆర్టీఐ అప్పీల్ కేసులను ప్రత్యేక హియరింగ్ ద్వారా పరిష్కరించనున్నట్టు తెలిపారు.

సమాచార కమిషనర్లు బొరెడ్డి అయోధ్య రెడ్డి దేశాల భూపాల్, పీవీ శ్రీనివాస్,  మొహసీనా పర్వీన్ మాట్లాడుతూ, ఆర్టీఐ చట్టం ప్రజలకు లభించిన వజ్రాయుధమని పేర్కొన్నారు. తప్పుడు సమాచారం లేదా ఆలస్యమైన సమాధానాలపై చట్టం ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. గతంలో కమిషన్ లేకపోవడంతో 17,000 పైగా కేసులు పెండింగ్‌లో ఉన్నాయని, ప్రస్తుతం వాటిని వేగంగా పరిష్కరిస్తున్నామని తెలిపారు. తెలంగాణ రాష్ట్రం దేశంలో ఆర్టీఐ చట్టం అమలులో అగ్రస్థానంలో నిలవాలని ఆకాంక్షించారు.

ఈ కార్యక్రమంలో ఆర్డీవోలు, ఏసీపీలు, ఫస్ట్ అప్పిలేట్ అధికారులు, పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్లు, పోలీసులు, వివిధ శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.