Latest News

హరీశ్ రావు సవాలుకు దిగి వచ్చిన సర్కారు

18 Aug, 2025 98 Views
Main Image

హరీశ్ రావు సవాలుకు దిగి వచ్చిన సర్కారు

కాళేశ్వరం ఎత్తిపోతలు ప్రారంభించిన నీటిపారుదల శాఖ అధికారులు

సిద్ధిపేట, ఆగస్టు 18(అవనివిలేకరి)అన్న పూర్ణ, రంగనాయక సాగర్ రిజర్వాయర్లలోకి సోమవారం ఉదయం  నీటి ఎత్తి పోతలను నీటి పారుదల శాఖ అధికారులు ప్రారంభించారు. గోదావరిలో ప్రవహించే వరద నీరు సముద్రంలో కలిసి పోతోందని, కాళేశ్వరం పంపులను ఆన్ చేసి రిజర్వాయర్లు నింపి తద్వారా చెరువులు కుంటలకు నీటిని విడుదల చేయాలని కోరుతూ వారం రోజుల కిందట మాజీ మంత్రి, సిద్ధిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్ రావు రాష్ట్ర నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి లేఖ రాశారు. అయినా ప్రభుత్వం నుంచి స్పందన లేకపోవడంతో ఆదివారం సిద్ధిపేటలో నిర్వహించిన మీడియా సమావేశంలో హరీశ్ రావు మాట్లాడుతూ కాళేశ్వరం పంపులను వెంటనే ఆన్ చేసి రిజర్వాయర్లను నింపడంతో పాటు చెరువులు కుంటల్లోకి నీటిని విడుదల చేయాలని డిమాండ్ చేశారు. కాళేశ్వరం కూలిందన్న కాంగ్రెస్ పార్టీ విష ప్రచార నిజమని నమ్మించడం కోసమే కాలేశ్వరం పంపులు రాష్ట్ర ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా ఆన్ చేయడం లేదని ధ్వజమెత్తారు. రాష్ట్ర ప్రభుత్వానికి రైతు ప్రయోజనాల కంటే రాజకీయ ప్రయోజనాలు ముఖ్యమాయ్యాయని విరుచుకుపడ్డారు. వరద నీరంతా వృధాగా వెళుతున్నా సీఎం రేవంత్ రెడ్డి, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కళ్లప్పగించి చూస్తున్నారని విమర్శించారు. తాను రాజకీయాల కోసం ప్రభుత్వంపై విమర్శలు చేయడం లేదని, రైతు ప్రయోజనాల గురించి మాత్రమే మాట్లాడుతున్నా నని హరీశ్ రావు పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం స్పందించి కాళేశ్వరం పంపులను వెంటనే ఆన్ చేసి రిజర్వాయర్లను తద్వారా చెరువులు, కుంటలను నింపకపోతే తామే లక్షలాదిమంది రైతులతో వెళ్లి పంపులను ఆన్ చేస్తామని సర్కార్ కు సవాలు విసిరారు. హరీశ్ రావు వారం కిందట రాసిన లేఖ.. ఆదివారం నిర్వహించిన మీడియా సమావేశంతో సర్కార్ లో కదలిక వచ్చింది.

రైతుల కోసం మోటార్లు ఆన్ చేస్తామని హెచ్చరించగానే కాంగ్రెస్ సర్కారు  దిగి వచ్చింది.  రంగనాయక సాగర్,  మల్లన్న సాగర్,  కొండ పోచమ్మ సాగర్లలోకి నీళ్లు విడుదల చేయకుంటే తీవ్ర పరిణామాలు ఉంటాయని, గోదావరి నదిలో నీళ్లు సముద్రంలోకి వృధాగా వెళుతూ ఉంటే కాళేశ్వరం రిజర్వాయర్లను ఖాళీగా పెడుతున్నారని సీఎం రేవంత్ రెడ్డికి నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ సవాళ్లు విసిరిన హరీష్ రావు. వరుస హెచ్చరికలు,సవాళ్లతో తలొగ్గిన ప్రభుత్వం 

అన్న పూర్ణ, రంగనాయక సాగర్ రిజర్వాయర్లలోకి సోమవారం ఉదయం నీటి పారుదల శాఖ అధికారులు నీటి ఎత్తిపోతలు ప్రారంభించారు. మొక్కుబడిగా కాకుండా రిజర్వాయర్లు పూర్తిగా నిండే వరకు నీటిని ఎత్తిపోయాలని  ఈ సందర్భంగా హరీశ్ రావు ప్రభుత్వానికి సూచించారు. కాళేశ్వరం ప్రభుత్వం ప్రారంభించడంతో హరీశ్ రావుకు రైతాంగం కృతజ్ఞతలు తెలియజేసింది.