Latest News

12 మంది సీఎంలపై క్రిమినల్‌ కేసులు సీఎం రేవంత్‌రెడ్డిపై 89 కేసులు

23 Aug, 2025 57 Views
Main Image

12 మంది సీఎంలపై క్రిమినల్‌ కేసులు

 సీఎం రేవంత్‌రెడ్డిపై 89 కేసులు

 స్టాలిన్‌పై 47.. చంద్రబాబుపై 19

ఎన్నికల అఫిడవిట్ల ఆధారంగా వెల్లడించిన ఏడీఆర్‌


న్యూఢిల్లీ, ఆగస్టు 23(అవనివిలేకరి) దేశంలోని 30 మంది ముఖ్యమంత్రుల్లో 12 మంది తమపై క్రిమినల్‌ కేసులున్నాయని ప్రకటించారు.దీనికి సంబంధించి అసోసియేషన్‌ ఫర్‌ డెమోక్రటిక్‌ రీఫామ్స్‌ (ఏడీఆర్‌) సంస్థ వెల్లడించింది. తనపై 89 కేసులున్నాయని సీఎం రేవంత్‌ రెడ్డి ప్రకటించారు. తమిళనాడు సీఎం స్టాలిన్‌ తనపై 47 కేసులున్నాయని తెలపగా, ఆంధ్రప్రదేశ్‌ సీఎం నారా చంద్రబాబు నాయుడు తనపై 19 కేసులున్నాయని ప్రకటించారు. కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య తనపై 13 కేసులున్నాయని తెలపగా, తనపై 5 కేసులున్నాయని జార్ఖండ్‌ సీఎం హేమంత్‌ సొరేన్‌ ప్రకటించారు.మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీ్‌సపై 4, హిమాచల్‌ ప్రదేశ్‌ సుఖ్వీందర్‌ సింగ్‌పై 4, కేరళ సీఎం పినరాయి విజయన్‌పై 2, పంజాబ్‌ సీఎం భగవంత్‌ మాన్‌పై ఒక క్రిమినల్‌ కేసు ఉన్నట్లు ప్రకటించారు. కనీసం 10 మంది సీఎంలు తమపై హత్యాయత్నం, కిడ్నాపింగ్‌, లంచాలకు సంబంధించిన అత్యంత తీవ్రమైన నేరారోపణలు ఉన్నట్లు ప్రకటించారు. కనీసం ఐదేళ్ల శిక్షపడే కేసుల్లో అరెస్టై 30 రోజులు నిర్బంధంలో ఉంటే 31వ రోజు ప్రధానినైనా, ముఖ్యమంత్రినైనా, మంత్రులనైనా పదవుల్లోంచి తొలగించే బిల్లును కేంద్రం తీసుకొచ్చిన నేపథ్యంలో ఈ కేసుల వివరాలు బయటకు రావడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఎన్నికల సందర్భంగా ఆయా ముఖ్యమంత్రులు ప్రకటించిన అఫిడవిట్‌ల ఆధారంగా ఏడీఆర్‌ ఈ వివరాలు సేకరించింది.